iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో ఒక అరుదైన థ్రిల్లర్ – Nostalgia

  • Published Sep 07, 2021 | 11:51 AM Updated Updated Sep 07, 2021 | 11:51 AM
టాలీవుడ్ లో ఒక అరుదైన థ్రిల్లర్  – Nostalgia

ఇప్పుడంటే ఓటిటిలు, విపరీతమైన డబ్బింగులు ద్వారా సైకో కిల్లర్ల కథలు ఎక్కువగా చూస్తూ వాటికి అలవాటు పడిపోయాం కానీ ఒకప్పుడు వీటిని ఎంజాయ్ చేయాలంటే కేవలం హాలీవుడ్ మూవీస్ మాత్రమే ఆప్షన్ గా ఉండేవి. అందులోనూ ఇలాంటివి ప్రతిదీ థియేటర్ కి వచ్చేవి కాదు కాబట్టి హోమ్ ఎంటర్ టైన్మెంట్ అందుబాటులో ఉన్నవాళ్ళకు మాత్రమే చూడగలిగే అవకాశం ఉండేది. సరిగ్గా దీన్ని పసిగట్టి సరైన రీతిలో ఒక థ్రిల్లర్ ని కనక తీయగలిగితే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మి దర్శకుడు శేఖర్ సూరి రాసుకున్న కథే ఏ ఫిలిం బై అరవింద్. టైటిల్ చూడగానే ఇదేదో సినిమా రంగానికి చెందినదనుకుంటారు కానీ ఇది పూర్తిగా విభిన్నం.

ఇప్పటి ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు శేఖర్ సూరి కజిన్ వరస. అసలు పేరు ఎస్ఎస్ చంద్రశేఖర్. కానీ ప్రత్యేకంగా ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మార్చుకున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు కావాలనే లక్ష్యంతో అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో ఒక స్నేహితుడి ద్వారా హీరో తరుణ్ ని కలిసే అవకాశం దక్కింది. ఇతను చెప్పిన ఒక లైన్ నచ్చడంతో ఏకంగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేశారు. ఆ సినిమానే 2002లో వచ్చిన అదృష్టం. కానీ అనూహ్యంగా అది డిజాస్టర్ అయ్యింది. పెద్ద క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ ఇవేవీ ఉపయోగపడలేదు. కట్ చేస్తే మూడేళ్ళ గ్యాప్. స్టార్లెవరూ పిలవలేదు.

ఆ టైంలో అసలు పేరున్న తారాగణం లేకుండా కంప్లీట్ గా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏ ఫిలిం బై అరవింద్ తీశారు శేఖర్ సూరి. ఒక దర్శకుడు ఒక హీరో ఇద్దరూ కలిసి పూర్తిగా అందుబాటులో లేని ఒక కథ కోసం అడవికి వెళ్తారు. పుస్తకంలో రాసినట్టే వాళ్ళు చదివిన దారుణమైన సంఘటనలు నిజంగానే ఎదురవుతాయి. ఆఖరికి ఒకరినొకరు చంపాలనుకునే దాకా వస్తుంది. సినిమా ఆద్యంతం ఒక డిఫరెంట్ టోన్ లో తీసిన శేఖర్ సూరి ;ఆశించిన ఫలితాన్ని అందుకున్నారు. 2005 జులై 9న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా కారు ఛేజింగులు, గెస్ట్ హౌస్ లో జరిగే డార్క్ క్రైమ్ ఇవన్నీ భలేగా థ్రిల్ చేశాయి. ఆ తర్వాత శేఖర్ సూరి ఇలాంటి విజయం మళ్ళీ అందుకోనే లేదు. తీసిన నాలుగు సినిమాలు కనీస స్థాయిలో కూడా ఆడలేదు

Also Read :  ముసలి బావకు పడుచు గుణపాఠం – Nostalgia