UPSC సివిల్స్ 2021 ఫలితాల్లో టాప్ 100లో 11 మంది మన తెలుగు వాళ్ళే.. ఓవరాల్‌గా 40 మంది..

తాజాగా UPSC సివిల్స్‌ -2021 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. తొలి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే సాధించారు. ఢిల్లీకి చెందిన శృతి శర్మ UPSC సివిల్స్‌ -2021 పరీక్ష ఫలితాలలో నంబర్‌ 1 ర్యాంకు సాధించగా ఆ తర్వాత వరుసగా అంకితా అగర్వాల్‌, గామిని సింగ్లా, ఐశ్వర్య వర్మ రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో సత్తా చాటారు.

ఇక ఈ సారి సివిల్‌ సర్వీసెస్‌లో తెలుగువారు కూడా ఉత్తమ ర్యాంకులతో సత్తా చాటారు. జాతీయ స్థాయిలో 685 మందిని సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక చేయగా ఇందులో 40 మంది వరకు తెలంగాణ, ఏపీల నుంచి ఉన్నారు. టాప్‌–100 ర్యాంకర్లలో 11 మంది తెలుగువాళ్లు ఉండటం విశేషం. వీరే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కూడా మరి కొంతమంది అభ్యర్థులు తెలుగు రాష్ట్రాల తరపున ఎంపికయ్యారు.

హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుని తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌ పరీక్షలకు హాజరైన వారిలో జాతీయ స్థాయిలో 9, 16, 37, 51, 56, 62, 69 తదితర ర్యాంకులు సాధించారు. దీనిపై ఆయా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ కి ఎంపికైన వారికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అభినందనలు తెలియచేశాయి.

Show comments