iDreamPost

IELTSలో హై స్కోరు. ఒక్క ముక్క ఇంగ్లీషు రాదు. అమెరికాలో దొరికిపోయిన గుజరాత్ స్టూడెంట్స్

IELTSలో హై స్కోరు. ఒక్క ముక్క ఇంగ్లీషు రాదు. అమెరికాలో దొరికిపోయిన గుజరాత్ స్టూడెంట్స్

ఆ ఆరుగురు ఇండియన్ స్టూడెంట్స్ IELTS లో 6.5 నుంచి 7 bands సాధించారు. స్టూడెంట్ వీసాపై కెనడా వెళ్ళారు. చట్ట విరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించబోతూ పట్టుబడ్డారు. విచిత్రమేమంటే IELTS లో అంత స్కోరు కొట్టినా జడ్జితో ఒక్క ముక్క కూడా ఇంగ్లీషులో మాట్లాడలేకపోయారు. అక్కడ తీగ కదిలిస్తే గుజరాత్ లో డొంక కదిలింది.

గుజరాత్ లోని మెహ్ సానా కి చెందిన నలుగురు కుర్రాళ్ళు, గాంధీ నగర్, పటాన్ కి చెందిన మరో ఇద్దరు కుర్రాళ్లు ఎలాగైనా అమెరికా వెళ్దామనుకున్నారు. అందరి వయసు 21 ఏళ్ళ లోపే. నేరుగా అమెరికా వెళ్ళడం కష్టం కాబట్టి కెనడాకి స్టూడెంట్ వీసా సంపాదించి ఆ తర్వాత అమెరికా చెక్కేద్దామని ప్లాన్ వేసుకున్నారు. 2021 సెప్టెంటర్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ IELTS రాశారు. 6.5 నుంచి 7 bands వరకు స్కోరు కొట్టారు. మొత్తానికి స్టూడెంట్ వీసా సంపాదించి ఈ ఏడాది మార్చ్ లో కెనడా చేరుకున్నారు. కానీ రెండు వారాలకే అక్రమంగా అమెరికా వెళ్ళడానికి సిద్ధమైపోయారు. కెనడా, యుఎస్ బార్డర్ లోని సెయింట్ రీజిస్ నదిలో బోటేసుకుని బయల్దేరారు. కానీ ఆ బోటు కాస్తా మునిగిపోతుండడంతో US బార్డర్ అధికారులు వారిని రక్షించారు. విషయం తెలుసుకుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ కోర్టులో జడ్జి అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ఈ స్టూడెంట్స్ ఇంగ్లీషులో సమాధానం చెప్పలేకపోయారు. చివరికి హిందీ అనువాదకుడి సాయం తీసుకోవాల్సి వచ్చింది. IELTSలో 6.5 నుంచి 7 bands వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇదా అని అక్కడి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.

అమెరికా పోలీసుల విజ్ఞప్తి మేరకు గుజరాత్ పోలీసులు స్థానికంగా జరుగుతున్న IELTS స్కామ్ పై దర్యాప్తు ప్రారంభించారు. మెహసానా పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇన్స్పెక్టర్ భవేష్ రాథోడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ లో IELTS కండక్ట్ చేసిన ఏజెన్సీ చాలా అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో CCTVలు ఆపేసినట్లు తెలుస్తుంది. డాక్యుమెంట్లు తీసుకుని హాజరవ్వాల్సిందిగా పోలీసులు సంస్థ నిర్వాహకులకు నోటీసులు పంపారు. ఇలాంటి సంస్థలు ఇండియాలో చాలానే ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి