iDreamPost
android-app
ios-app

నీటి కలల సాకారం దిశగా- మూడు శంకుస్థాపనలు

  • Published Dec 23, 2019 | 3:54 PM Updated Updated Dec 23, 2019 | 3:54 PM
నీటి కలల సాకారం దిశగా- మూడు శంకుస్థాపనలు

పారిన నీటికి సాక్ష్యం అవసరమా?నీళ్లున్న కాలువ,పండిన పంట,దప్పిక తీరిన ప్రజలు … సజీవ సాక్షాలే!

నెల విడిచి సాము చేయటం కాలువలు వదిలి శిలాఫకాలు వేసుకుంటూ పోవటం రెండు ఒకటే!శిలాఫలకాలు,పేపర్లలో ఫోటోలు చూసుకొని మురిసి పోవచ్చు.. అన్ని నేనే చేశా .. కరువు నన్ను చూసి పారిపోయింది అని చెప్పుకోవచ్చు కానీ ఎండిన పంట,నెర్రలిచ్చిన భూమి ,తడే కానీ కాలువలు నిజం చెప్పకుండా పోతాయా?

సమస్య ఇదే, ప్రచార ఆర్భాటం తప్ప నీళ్లు పారటానికి సరిపడా సామర్ధ్యం ఉన్న కాలువలు,పారిన నీటిని నిలువ చేయటానికి అవసరమైన రిజర్వాయర్లు కట్టకుండా నీళ్లు ఇచ్చాను ఇచ్చాను అని ఎంత చెప్పుకున్న రైతులకు ప్రజలకు జరిగే మేలు శూన్యం.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు,నీటి ప్రాజెక్టుల విషయంలో ఏమి చేస్తాడు?అని ఎదురు చూస్తున్న నాలాంటి వారికి ఈ రోజు శంకుస్థాపన చేసిన మూడు ప్రాజెక్టులు సంతృప్తిని ఇస్తాయి. శంకుస్థాపనలకే సంతృప్తి చెందాలా?సమాధాన పాక్షికంగా అవును ,పాక్షికంగా కాదు కానీ శంకుస్థాపన చేసింది కరువును శాశ్వతంగా నివారించే పథకాలు కావటం వలన అంటే “సమస్య మూలాన్ని” గుర్తించటం వలన నిజంగానే సంతృప్తి కలుగుతుంది.

ప్రతి సంవత్సరం గోదావరి నుంచి మూడు వేల టీఎంసీ ల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి… ఆ నీటిని కృష్ణ కు మళ్లించాలి.. ఈ వాదన వినటానికి బాగానే ఉంది. మరి వర్షాలు బాగా పడిన యేడు ఎన్ని టీఎంసీ ల కృష్ణా నీరు సముద్రం పాలవుతుంది?ఉన్న నీరు వినియోగానికి చర్యలు తీసుకోవద్దా?

ఈ సంవత్సరమే తీసుకోండి,ఆగస్టు రెండవ వారంలో కృష్ణ నదికి మొదలైన వరద అక్టోబర్ చివరి వరకు అంటే సుమారు 85 నుంచి 90 రోజులు వరద వచ్చింది.. మరి రాయలసీమ లోని అన్ని ప్రాజెక్టులు నిండాయా?ఎన్ని టీఎంసీ లను నిలువ చేశారు?

హంద్రీ-నీవా,గాలేరు-నగరి రెండు ప్రోజెక్టుల మీది చిన్న చిన్న రిజర్వాయర్లన్నీ కలిపి కూడా 80 టీఎంసీ సామర్ధ్యం లేదు. వీటిలో కూడా చెప్పుకోదగ్గవి గండికోట-26.85,వెలిగోడు -16.95 టీఎంసీ ,బ్రహ్మం సాగర్ – 17.74 టీఎంసీ ఈమూడు ప్రాజెక్టులు కాకుండా 15 టీఎంసీ ల నిలువ సామర్ధ్యం ఉన్న ప్రాజెక్ట్ రాయలసీమలో లేదు.

మరి 90 రోజుల వరద వస్తే అన్ని ప్రాజెక్టులు నిండాలి కదా?ఒక్క వెలుగోడు తప్ప గండికోట నిండలేదు,బ్రహ్మం సాగర్ నిండటం కాదు కదా కనీసం 5 టీఎంసీల నీళ్లు కూడా పారలేదు. కారణం?నిర్లక్ష్యం…

గండికోట ప్రాజెక్ట్ కు 2005లో వైస్సార్ శంకుస్థాపన చేస్తే 2012 నాటికే పూర్తి అయ్యింది. కిరణ్ కుమార్ రెడ్డి ట్రయిల్ రన్ నిర్వహించాడు. కానీ అప్పటి నుంచి గడచిన 7 సంవత్సరాలలో ముంపు గ్రామాలకు R & R ఇచ్చి ఖాళి చేపియ్యలేదు. ముంపుకు గురయ్యే 22 గ్రామాలలో కేవలం 14 గ్రామాల వారికి R& R ప్యాకేజి ఇచ్చి ఖాళి చేపించారు ,మిగిలిన 8 గ్రామాలను పట్టించుకోలేదు. దీనితో కేవలం 12 టీఎంసీ లు మాత్రమే నిలువ చేయగలిగారు. మొత్తం 22 గ్రామాలను ఖాళీ చేపించి ఉంటే పూర్తి సామర్ధ్యం 26 టీఎంసీ లా నీటిని నిలుపుకోవటానికి అవకాశం ఉండేది.

బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ తెలుగు గంగ పథకంలోనిది.1983లో కడప జిల్లా బ్రహ్మం గారి మఠంలో ఎన్టీఆర్,MGR కలిసి శంకుస్థాపన చేశారు. కానీ వైస్సార్ వచ్చి పనులు పూర్తి చేసి 2007లో ప్రారంభోత్సవం చేశారు.. అంటే దాదాపు 25 సంవత్సరాలు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు.

తెలుగు గంగ కాలువ మీద మొదటి వెలుగోడు ప్రాజెక్ట్ వరకు కాలువ బాగుంది. వెలుగోడు నుంచి నల్లమల అటవీ మార్గంలో ఎక్కువ దూరం కాలువ ఉంది. ఇక్కడ కాలువ బాగా దెబ్బతినింది.గట్టిగా 1000 క్యూసెక్కులు ఈ కాలువలో కూడా పారటం కష్టం. కాలువకు మరమత్తులు కానీ ఆధునీకరణ పనులు కానీ చేపట్టలేదు.

ఈ కాలువ ద్వారా అతి కష్టం మీద Subsidiary Reservoir -1(2.13 టీఎంసీ),Subsidiary Reservoir -2 (2.44 టీఎంసీ) లకు కలిపి ఈ సీజన్లో 5 టీఎంసీల నీరు చేరింది. అక్కడి నుంచి బ్రహ్మం సాగరుకు గట్టిగా 2 టీఎంసీ ల నీరు కూడా చేరలేదు. ఈ రోజుకు కూడా బ్రహ్మం సాగర్లో కేవలం 2.64 టీఎంసీ ల నీరే ఉంది.

పోతిరెడ్డి పాడు నుంచి బానకచెర్ల కు చేరిన నీరు నిప్పుల వాగు ఎస్కేప్ ఛానల్ ద్వారా కుందు నదిలోకి అక్కడి నుంచిపెన్నాలోకి కలిసి సోమశిల చేరుతున్నాయి. 78 టీఎంసీ ల సోమశిల ,68 టీఎంసీల కెపాసిటీ ఉన్న కండలేరు ప్రాజెక్టులకు ఈ సీజన్లో 170 టీఎంసీలకు పైగా నీరు పారింది. రెండు ప్రాజెక్టులలో కలిపి ఈరోజుకు 113 టీఎంసీ ల నీరు ఉంది.

గత ప్రభుత్వం ఈ లెక్కలనే , పోతిరెడ్డిపాడు నుంచి “రాయలసీమకు 120 టీఎంసీ లు ఇచ్చాము(ఇందులో సోమశిల కు ఇచ్చిన నీరు కూడా ఉంది)”.. అని మాయచేసి చెప్పేది. వాస్తవంగా పోతిరెడ్డి పాడు నుంచి రాయలసీమకు గట్టిగా 50 టీఎంసీ ల నీరు వొచ్చిందే లేదు. కారణం పైన చెప్పిన కాలువ ,గండికోట ముంపు గ్రామాలు ఖాళి చేపించకపోవటం. హంద్రీ-నీవా కింద రిజర్వాయర్లు,చెరువులు అన్ని కలిపి కూడా 15 టీఎంసీ లు లేవు.

ఈ రోజు జగన్ మూడు ప్రాజెక్టులకు శంకుస్థాప న చేశాడు,
1. కుందు నది మీద జోలదరాశి ప్రాజెక్ట్,దీని సామర్ధ్యం 0.8 టీఎంసీలు . దీనితో కోయిలకుంట్ల ప్రాంతంలో తాగు నీరు,సాగు నీరు అందుతుంది.
2. కుందు నది మీద 2.95 టీఎంసీ ల సామర్ధ్యంతో రాజోలి రిజర్వాయర్ నిర్మాణం.
కుందూ నది మీద సంతజూటూరు,రాజోలి,ఆదినిమ్మాయపల్లి వద్ద చిన్న ఆనకట్టలు ఉన్నాయి. ఆనకట్ట అంటే గేట్లు లేని పెద్ద చెక్ డ్యాం లాంటిది. నీటి ప్రవాహానికి అడ్డంగా కట్టిన గోడ అనుకోండి. వీటి వలన ఎక్కువ నీరు నిలువ చేయటానికి అవకాశం లేదు.

జోలదరాశి మరియు రాజోలి రిజర్వాయర్ నిర్మాణం వలన 3.75 టీఎంసీల నీటిని నిలువ చేయొచ్చు.వీటి వలన వరద ఎక్కువగా వస్తే మొదటి పంటకు 100% గ్యారెంటీ గా నీళ్లు దక్కుతాయి. ఒక మోసరుగా వరద వచ్చినా ఒక పంట కు నీళ్లు దక్కుతాయి. అదృష్టం ఉంటె రెండవ పంటకు కొంతమేర నీళ్లు దక్కొచ్చు. ప్రొద్దుటూరు,కోయిలకుంట్లకు తాగు నీరు కూడా దక్కుతుంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ అంచనా 1670 కోట్లు..ఈ లెక్క చూస్తే దాదాపు ఇంతే ఖర్చయినా పట్టిసీమ గుర్తు రావచ్చు..వీటిని కడితే పట్టిసీమకొచ్చినంత ప్రచారం రాదు కదా?

అత్యంత దుర్మార్గమైన విషయం ఏమిటంటే ఈ రెండు ప్రాజెక్టులకు 2008 వైస్సార్ పాలనా పరమైన అనుమతులు ఇచ్చాడు,జోలదరాశికి శంకుస్థాపన్ చేసాడు కూడా. 2014లో బనగానపల్లె నుంచి టీడీపీ గెలిచినా జోలదరాశికి విముక్తి దక్కలేదు.

జోలదరాశి కోసం మొదటి నుంచి పోరాడుతున్న “కుందు పరిరక్షణా సమితి” కామిని వేణుగోపాల్ రెడ్డి టీడీపీ హయాంలోనూ కృషి చేసాడు కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్ పాదయాత్ర సమయంలో కామిని వేణుగోపాల్ రెడ్డి బృందం జగన్ను కలిసి జోలదరాశి అవసరాన్ని వివరించి దాని నిర్మాణననికి జగన్ తో వాగ్ధానం చేపించారు.

కామిని వేణుగోపాల్ రెడ్డి బృందం కృషి కావొచ్చు,స్వయంగా నీటి ప్రాజెక్టుల మీద జగన్ కు ఉన్న ఆసక్తి కావచ్చు నేడు జోలదరాశి మరియు రాజోలి రిజర్వాయర్ పనులకు శంకుస్థాన చేసాడు.వీటి నిర్మాణం పూర్తి చేయటం మీద జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 18 నెలల నుంచి 24 నెలలలోనే పనులు పూర్తి కావాలి. నిర్మాణాలు పూర్తి కాకుంటే చంద్రబాబుకు వచ్చినట్లే జగన్ కు చెడ్డపేరు వస్తుంది.

3.ఈరోజు శంకుస్థాపన చేసిన మూడు ప్రాజెక్టు .. కుందూ నది నుంచి దువ్వూరు చెరువుకు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి సబ్సిడరీ – 1 రిజర్వాయర్ కు నీటిని పారించే పథకం.

వెలుగోడు – బ్రహం సాగర్ మధ్య తెలుగ గంగ కాలువకు మరమత్తులు చేసినా గరిష్టంగా 3000 క్యూసెక్కుల నీటిని మాత్రమే పారించగలరు. దీని కన్నా బానకచెర్ల వద్ద నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్ ద్వారా కృష్ణా నీటిని కుందు లోకి వదిలి దువ్వూరు సమీపంలో జొన్నారం వద్ద చిన్నఆనకట్ట కట్టి , లిఫ్ట్ ద్వారా దువ్వూరు చెరువుకు,అక్కడి నుంచి సబ్సిడరీ – 1 రిజర్వాయర్కు నీటిని పారించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ పథకం ద్వారా రోజుకు 1425 క్యూసెక్కులు 65 రోజుల్లో 8 టీఎంసీ ల నీటిని బ్రహ్మం సాగరుకు పారిస్తారు. తెలుగు గంగ ద్వారా మరో 3-4 టీఎంసీ లా నీరు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా బ్రహ్మం సాగరులో 12 నుంచి 15 టీఎంసీ ల నీటిని నిలువ చేయటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

జగన్ ఆలోచన బాగుంది,మంచి ప్రాజెక్టులకు తోలి పునాది వేశాడు ,వీటి నిర్మాణం మీద అదనపు దృష్టి పెట్టాలి. ఆర్ధిక,రాజకీయ .. ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్న గడువు లోపు ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి.