iDreamPost
iDreamPost
దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు గడిచిన ఏడాది కాలం సాక్ష్యంగా నిలిచింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ కాలమంతా కొంచెం తీపి, ఎంతో చేదు అన్నట్టుగానే ఉంది. పెట్రోల్ ధరలు వంటివి సామాన్యులను సతమతం చేస్తున్నాయి. అంతర్జాతీయంగానూ మోదీ ఇమేజ్ కి కరోనా , రైతు ఉద్యమాల మూలంగా బీటలు వారాయి. అయినా దేశంలో తిరుగులేని స్థానంలో ఉన్న మోదీ మళ్లీ పుంజుకునేందుకు పలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.
అదే సమయంలో తెలంగాణ సారథిగా ఉన్న కేసీఆర్ కూడా వేగంగా పావులు కదుపుతున్నారు. గులాబీ జెండా గుభాళింపులు కొనసాగాలని భావిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఆయనకు కూడా కొన్ని చేదు ఫలితాలు ఎదురయ్యాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుకి బాటలు వేసే దిశలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ కు ఆర్థిక పరిస్థితి, ఇతర కారణాలు మినహా రాజకీయంగా ఎదురులేని స్థితి ఉంది. రెండేళ్ల క్రితం నాటి సాధారణ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం మరింత సానుకూలత ఉందనే రీతిలో స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఫలితాలు సాధించారు. అదే జోరుని కొనసాగించాలనే సంకల్పం జగన్ లో కనిపిస్తోంది. దాంతో రాజకీయంగా ఈ ముగ్గురు నేతలు ఈ ఏడాది సాధించిన ఫలితాలు, వచ్చే ఏడాది మీద అంచనాలు అందరనీ ఆకట్టుకుంటున్నాయి.
రాజకీయంగా…
ఈ ఏడాది దేశ రాజకీయాల్లో కీలక పరిణామం రైతు ఉద్యమం. చివరకు మోదీ ప్రభుత్వాన్ని వెనకడుగు వేయించిన ఘనత ఆ పోరాటానికి దక్కింది. రాబోయే కాలంలో ఈ ఉద్యమ ప్రభావం వివిధ రంగాల్లో ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. పట్టుసడలకుండా సాగించిన అన్నదాతల పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కరోనా కాలంలో కూడా పట్టుదల ప్రదర్శించడం వారి ప్రత్యేకత.
ఇక ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి అసోంలో అధికారం నిలబెట్టుకున్నప్పటికీ బెంగాల్ లో ఓటమి బీజేపీని బాధించింది.
తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. కర్ణాటక పరిణామాల్లోనూ ఏడాది చివరకు బీజేపీ ప్రభావం సన్నగిల్లుతోంది. సీఎం ని మార్చిన తర్వాత కూడా బీజేపీ హవా తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఈటెల రాకతో హుజూరాబాద్ కూడా బీజేపీ ఖాతాలో చేరింది. అయితే అది ఈటెల సొంత ఇమేజ్ సాధించిన విజయంగా పలువురు భావించే స్థితి ఏర్పడింది.
మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి సర్కారుని కూల్చాలని కొన్ని ఎత్తులు వేసినా ఫలించలేదు. ఉత్తరాదిన ముఖ్యంగా బీహార్ లో బీజేపీ లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చినా యూపీ స్థానిక ఎన్నికల్లో మాత్రం యోగీ సర్కారు వెనుకబడింది. రాబోయే రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నందున అందరి దృష్టిని ఆకర్షించింది.
జాతీయ స్థాయిలో మోదీ- అమిత్ షా పట్టు కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నా వివిధ సంస్థల అమ్మకాల ద్వారా నెట్టుకురావడానికి అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ కోలుకోకపోవడం, విపక్షాల అనైక్యత వంటివి బీజేపీకి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. పెట్రోల్ సహా వివిధ ధరల పెరుగుదల తీవ్రంగా ఉంది. నిరుద్యోగం విస్తృతమయ్యింది. రైతు ఉద్యమాలు సరేసరి. ఇవన్నీ మోదీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత కొంతమేరకు తగ్గించాయి. ఇతర నేతలెవరూ నేటికీ ఆయనకి దరిదాపుల్లో లేరనే వాదన వినిపిస్తోంది.
ఏపీలో విపక్షాల సందిగ్ధం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ కి జనాదరణ కొనసాగింది. అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాలు సాధించింది. విపక్ష శిబిరం పేలవంగా మారింది. టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆపార్టీతో జతకట్టేందుకు బీజేపీ కూడా సంసిద్ధత తెలియజేయడం లేదు. జనసేన కూడా ఎటు ఉంటుందో తెలియని సంశయం. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా అంతంతే.
ఈ నేపథ్యంలో కాపు కులస్తులంతా కలిసి ఒకే వేదిక మీదకు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం, జనసేన అనుభవాలతో పగడ్బందీగా అడుగులు వేస్తామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా కొంత ప్రయత్నం కూడా జరిగింది. ఇక మతాల ఆధారంగా రాజకీయాలకు ప్రయత్నించిన టీడీపీ, బీజేపీ ఆశలు నెరవేరలేదు. కుల, ప్రాంతీయ విబేధాల పాచిక కూడా పారలేదు. ముఖ్యంగా అమరావతి చుట్టూ రాజకీయ ప్రయోజనాల కోసం సాగించిన ప్రయత్నాలు పూర్తిగా లక్ష్యాలను చేరుకోలేదు. జగన్ సర్కారుని కోర్టుల ద్వారా నిలువరించాలనే యత్నం చేస్తుందనే అభిప్రాయం బలపడింది. చివరకు మూడు రాజధానుల చట్టం వెనక్కి తీసుకోవడం ద్వారా జగన్ వ్యూహాత్మకంగా సాగుతున్నారనే సంకేతాలు ఇచ్చారు.
కేసీఆర్ లో కదలిక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో మాత్రం ఈ ఏడాది కదలిక తీసుకొచ్చింది . గతంలో ఫాం హౌస్ దాటి బయటకు అడుగుపెట్టని కేసీఆర్ ఇటీవల పదే పదే ప్రజల మధ్యకు వెళుతున్నారు. వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరిగి ప్రజాదరణకు ప్రయత్నిస్తున్నారు. కారు జోరుకి ఢోకా లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ జవసత్వాలు కూడదీసుకునేందుకు యత్నిస్తోంది. అదే సమయంలో కమలం గేరు మార్చి దూకుడు ప్రదర్శించే దిశలో ఉంది. పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించి పుంజుకుంటున్నట్టు సంకేతాలు ఇస్తోంది.
ఈ దశలో తెలంగాణలో తమ పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ అనేక ఎత్తులు వేస్తోంది. హుజూరాబాద్ లో కేసీఆర్ వ్యూహాలు ఫలించలేదు. అయినా రాష్ట్రవ్యాప్తంగా పట్టు సడలిపోకుండా చూసుకునే దిశలో టీఆర్ఎస్ అధినేత ఉన్నారు. పీసీపీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఓ ఊపు ఊపారు. ప్రచారం మాత్రం సాధించారు. కానీ ప్రజల్లో పార్టీ పట్టు పెంచుకునే ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీ నేతలు నోటికి పనిచెబుతూ నిత్యం తామే విపక్షంగా కనిపించాలనే లక్ష్యంతో సాగుతున్నారు. దాంతో కాంగ్రెస్, కమలం కలహం కారుని గట్టెక్కిస్తుందనే ధీమా టీఆర్ఎస్ కి కల్పిస్తున్నారు.
మోదీ, జగన్, కేసీఆర్ కూడా కొత్త ఏడాదిలో తమ పట్టు నిలుపుకునే దిశలో పావులు కదుపుతున్నారు. మోదీ, కేసీఆర్ లు రెండేసి మార్లు ఎన్నికల్లో గెలిచినందున వారికి కొంత ఎదురుగాలి తప్పడం లేదు. అయినా ఎదురొడ్డి నిలుస్తారనే ధీమా వారి అభిమానుల నుంచి వస్తోంది. జగన్ కి మాత్రం ప్రస్తుతం పూర్తి ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాబోయే ఏడాదిలో ఎవరు తమ హవా సాగించగలుగుతారు, ఎవరు చతికిలపడతారు అనేది చూడాలి. అందులో తొలి పరీక్ష మోదీకి యూపీలో ఎదురవుతోంది. అక్కడ యోగీ సర్కారు ఎదురీదుతోంది. యూపీలో బీజేపీని గట్టెక్కిస్తేనే మోదీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. లేదంటే 2022లో రాజకీయాలు వేగంగా మారే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల మీద వాటి ప్రభావం అనివార్యంగా పడుతుంది.