iDreamPost
android-app
ios-app

2021 Corona, Omicron – కరోనా భయాలతో మొదలై, కరోనా (ఒమిక్రాన్) ఆందోళనతో ముగుస్తోంది.. ఈకాలంలో ఏం జరిగింది..?

  • Published Dec 31, 2021 | 2:59 AM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
2021 Corona, Omicron – కరోనా భయాలతో మొదలై, కరోనా (ఒమిక్రాన్) ఆందోళనతో ముగుస్తోంది.. ఈకాలంలో ఏం జరిగింది..?

ప్రపంచ చరిత్రలోనే గడిచిన రెండేళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈఏడాది మాత్రం మన దేశ చరిత్రలో మరచిపోలేని సంవత్సరంగా మిగులుతుంది. ముఖ్యంగా కోవిడ్ డెల్టా వేరియంట్ సృష్టించిన బీభత్సం దేశాన్ని విలవిల్లాడేలా చేసింది. రెండే రెండు నెలల్లో లక్షల మందిని పట్టుకుపోయింది. అయితే విలయం నుంచి కోలుకుని మళ్లీ గాడిలో పడుతున్న దశలో ఒమిక్రాన్ ఆందోళనలు వెంటాడుతున్నాయి. డెల్టా భయంతో 2021లో అడుగుపెట్టిన వారమంతా ఇప్పుడు ఒమిక్రాన్ కలవరం మధ్య 2022లో కాలు పెట్టాల్సి వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో కూడా డెల్టా తీవ్ర ప్రభావం చూపింది.

అయితే 2020, 21 సంవత్సరాల్లో వైరస్ తాకిడికి గురయిన తెలుగునేల ఇప్పుడు కాస్త ధీమాగా కనిపించడానికి ఏకైక కారణం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికావడం, మొదటి డోసుని ఉభయ తెలుగు రాష్ట్రాలు దాదాపుగా పూర్తి చేశాయి. అందరికీ వ్యాక్సిన్ అందిన మూలంగా వైరస్ విస్తరణ అంత వేగంగా ఉండకపోవచ్చనే ధీమా కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో యువతకు కూడా వ్యాక్సిన్ల పంపిణీ వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇది మరింత సానుకూల అంశంగా కనిపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితి ఈసారి ఉండబోదనే అభిప్రాయం కలిగిస్తోంది.

నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలతో మొదలు..

వరుసగా మూడో ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకల మీద ఆంక్షలు విధించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అనేక చోట్ల బహిరంగంగా వేడుకలను రద్దు చేశారు. పరిమిత సంఖ్యలో నిబంధనలను పాటిస్తూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 2020 ప్రారంభానికి ముందే చైనాలో వైరస్ తీవ్రత వెలుగుచూడడంతో ఆ ఏడాది అక్కడ న్యూ ఇయర్ వేడుకలు నిలిపివేశారు. అప్పటి నుంచి నేటికీ ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొత్త ఏడాదిని ఆనందంగా ఆహ్వానించే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతను తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఖాతరు చేయడం లేదు. వ్యాక్సిన్లు పూర్తికావడం, వైరస్ మ్యూటెంట్ ప్రభావం నామమాత్రంగా ఉండడంతో తమకు ఢోకా లేదనే వాదన వినిపిస్తోంది. పైగా డెల్టా వంటి తీవ్రమైన తాకిడిని తట్టుకుని నిలబడిన తర్వాత పాండమిక్ కాస్తా ఎండమిక్ గా మారిపోయిందనే అభిప్రాయం కొందరు శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తుండడం చాలామందిలో ధీమా పెంచుతోంది.

ఇలా కొత్త ఏడాది కూడా ఆంక్షల మధ్య మొదలవుతున్నప్పటికీ త్వరలోనే అంతా సర్దుకుని సాధారణ స్థితి వస్తుందనే అంచనాలు కనిపిస్తున్నాయి .థర్డ్ వేవ్ మొదలయినట్టేననే అభిప్రాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. అయితే దాని తీవ్రత మీద మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి. గతంలో ఎదుర్కొన్న గడ్డు స్థితిని మళ్లీ చూడాల్సిన స్థితి రాదనే ధీమా మాత్రం అన్ని వర్గాల్లోనూ ఉంది.

అంతా గాడిలో పడుతుందా..

ప్రస్తుతానికి సవాలక్ష సందేహాలతో కొత్త సంవత్సరానికి శ్రీకారం చుడుతున్నాం. కానీ భవిష్యత్తులో వచ్చే ఏడాది అంతా సానుకూలంగా ఉంటుందనే అంచనా మాత్రం వివిధ వర్గాల నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికరంగంలో కోలుకోవడం అత్యవసరమని అటు ప్రభుత్వాలు, ఇటు సామాన్యులు ఆశిస్తున్నారు. అన్ని రకాలుగా కుదేలయిన వ్యవస్థలు కోలుకుంటే తప్ప మళ్లీ పూర్వ వైభవం రాదనే వాదన ఉంది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో కొంత సద్దుమణిగింది. వ్యాపారాలు పుంజుకున్నాయి. జీఎస్టీ సహా వివిధ వసూళ్లు పెరిగాయి. ఇది కొనసాగితే మళ్లీ మార్కెట్లు పుంజుకుంటాయి. ప్రస్తుతం కేవలం స్టాక్ మార్కెట్ తప్ప మిగిలిన అన్ని వ్యాపారాలు ఆశాజనకంగా కనిపించడం లేదు. దాంతో 2022లో మాత్రం సాధారణ స్థితి కొనసాగితే ఆర్థికంగా క్లిష్ట పరిస్థితి నుంచి ఉపశమనం వస్తుందనే అంచనాలున్నాయి.

విద్యారంగం కూడా తీవ్రంగా ఒడిదుడుకులు ఎదుర్కొంది .

విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. రెండేళ్ల పాటు ఆన్ లైన్ చదువులు అంతంతమాత్రంగా సాగడంతో అంతా అస్తవ్యస్తంగా ఉంది. సర్టిఫికెట్లు వస్తున్నప్పటికీ సామర్థ్యం మీద సందేహాలున్నాయి. దాంతో భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు ఎదిగే ఈ తరం మీద అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అంతా చక్కబడి, సాధారణ పరిస్థితులు కొనసాగితేనే విద్యా వ్యవస్థ గాడిలో పడుతుంది.

దాదాపుగా అన్ని రంగాలను అస్తవ్యస్తం చేసిన కరోనా తాకిడి నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్న సమాజానికి ఈ ఊరట కొనసాగుతుందనే అంచనాలున్నాయి. అదే జరిగితేనే రాబోయే ఏడాది ఆశాజనకం అవుతుంది. అంతా మంచిగా సాగాలని ఆశిస్తూ స్వాగతం చెబుదాం.

Also Read : ఒమిక్రాన్ ఎఫెక్ట్ : వర్చువల్ ప్ర‌చారం మాత్ర‌మే..?