iDreamPost
android-app
ios-app

వినోదం సందేశం కలగలిసిన ‘జయం మనదేరా’ – Nostalgia

  • Published Oct 07, 2020 | 12:19 PM Updated Updated Oct 07, 2020 | 12:19 PM
వినోదం సందేశం కలగలిసిన ‘జయం మనదేరా’  – Nostalgia

2000వ సంవత్సరం. విక్టరీ వెంకటేష్ వరసవిజయాలతో మంచి ఊపుమీదున్నటైం . మధ్యలో రెండు మూడు మినహాయిస్తే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, గణేష్, ప్రేమంటే ఇదేరా , రాజా, కలిసుందాం రా ఇలా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లతో అప్రతిహతంగా కొనసాగుతున్న కాలం. ఆ టైంలో కలిశాడు దర్శకుడు శంకర్. అప్పటికే శ్రీరాములయ్య, ఎన్కౌంటర్ లాంటి సందేశాత్మక సామజిక స్పృహ కలిగిన సినిమాలతో పాటు యమజాతకుడు లాంటి ఎంటర్ టైనర్ ని డీల్ చేయగలనని రుజువు చేసుకుని ఉన్నారు. కులాల ప్రాతిపదికన ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతున్న వివక్ష మీద ఒక నాయకుడు చేసిన పోరాటాన్ని నేపధ్యంగా తీసుకుని దానికి వర్తమాన కాలానికి ముడిపెట్టి రాసుకున్న జయం మనదేరా కథను పరుచూరి బ్రదర్స్ సోదరుల సహాయంతో నిర్మాత సురేష్ బాబుని కలిసి వినిపించాడు.

ఆయనకు మహాదేవనాయుడి పాత్ర విపరీతంగా నచ్చేసింది. వెంకీని ఒక పవర్ ఫుల్ లీడర్ రోల్ లో చూడాలన్న ఆయన కోరిక ఇందులో తీరబోతోందని సంతోషించారు. బడ్జెట్ ఎక్కువ డిమాండ్ చేస్తుందని చెప్పినా నో అనలేదు. 40 ఆర్టిస్టులను తీసుకుని ఫస్ట్ హాఫ్ కోసం యూరోప్, లండన్, ఇటలీ తదితర దేశాల్లో చిత్రీకరణ జరిపారు. మ్యాట్రిక్స్ సినిమాలో వాడిన టైం ఫ్రీజ్ టెక్నాలజీని దీనికి వాడటం అప్పట్లో ఇండస్ట్రీ హాట్ టాపిక్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మహాదేవనాయుడి గెటప్ కోసం యూనిట్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సూర్యవంశంతో పోలిక రాకుండా వెంకటేష్ మీసకట్టుని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గెటప్ చూసుకున్నాక అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. వందేమాతరం శ్రీనివాస్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నందుకు పరిశ్రమ అంతా షాక్.

ఎర్ర సినిమాలకు బాణీలు కట్టే ఆయన్ని కమర్షియల్ మూవీకి ఎలా తీసుకున్నారా అని అనుమానాలు. వాటిని పటాపంచలు చేస్తూ ఆయన అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి మ్యూజికల్ గా జయం మనదేరా స్థాయిని పెంచారు. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది రెండో సగంలో మహాదేవనాయుడు ఫ్లాష్ బ్యాక్. కథగా వినడానికి రెగ్యులర్ గా అనిపించినా ట్రీట్మెంట్ పరంగా శంకర్ చూపించిన వైవిధ్యం అన్ని వర్గాలను ఆకట్టుకుంది. కాకపోతే క్లైమాక్స్ లో ఎడారి బ్యాక్ డ్రాప్ లో తల్లి సెంటిమెంట్ డ్రామా ఎక్కువ కావడం కొంత మైనస్ గా నిలిచింది. సౌందర్య, భానుప్రియలు హీరోయిన్లు గా చేయగా మిగిలిన క్యాస్టింగ్ చాలా భారీగా ఉంటుంది. జయప్రకాశ్ రెడ్డి విలనీ ప్రత్యేక ఆకర్షణ. వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. 34 కేంద్రాల్లో వంద రోజులు ఆడి సుమారు 14 కోట్ల దాకా షేర్ సాధించడం అప్పట్లో రికార్డు. అందుకే వెంకీ అభిమానులకు జయం మనదేరా వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఎప్పటికీ మర్చిపోలేని స్పెషల్ మూవీగా నిలిచింది