iDreamPost
iDreamPost
పిడుగుల వర్షానికి 17 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలతో పాటు పడిన పిడుగుల ధాటికి బీహార్ రాష్ట్రంలో 17 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పిడుగుల ధాటికి భాగల్ పూర్ లో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు, ఖగారియాలో ఇద్దరు, బంకాలో ఇద్దరు, కతిహార్ లో ఒకరు, సహర్సాలో ఒకరు, మాధేపురాలో ఒకరు, ముంగేర్ లో ఒకరు మృతి చెందినట్లు సీఎం నితీశ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తెలంగాణలోనూ పిడుగుల ధాటికి నలుగురు మృతి చెందారు. వీరిలో అధికంగా రైతులే ఉన్నారు. పిడుగుపాటుకు గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. దేశంలో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ముందుకు కదులుతున్నాయని, వీటి ప్రభావంతో ఉత్తర, మధ్య, తూర్పు భారతమంతటా రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు సమీపంలో ఉండరాదని హెచ్చరించింది. రైతులు కూడా వర్షాల సమయంలో పొలం భూమిలో ఉండకపోవడం మంచిదని సూచించింది.