Venkateswarlu
Venkateswarlu
అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కొత్త పథకాల్ని ప్రవేశ పెడుతోంది. ముఖ్యంగా అన్ని వర్గాలు ఆర్థికంగా వృద్ధి సాధించేలా చేసేందుకు ఆర్థిక సాయాన్ని సైతం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే దళితుల ఆర్థిక వృద్ధి కోసం దళిత బంధు పథకం.. బీసీల కోసం బీసీ బంధు పథకాలను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక, ఇప్పుడు మైనార్టీల కోసం బీసీ బంధులాగా ఓ పథకాన్ని తీసుకువచ్చింది. వారికి వంద శాతం సబ్సీడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకం కింద ముస్లిం, క్రిష్టియన్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందనుంది. 21 నుంచి 55 ఏళ్ల వయసు ఉండి..
గ్రామీణ ప్రాంతంలోని వాళ్లు 1.50 లక్షలు, పట్ణణ ప్రాంతంలోని వాళ్లు 2 లక్షల లోపు ఆదాయం కలిగి ఉంటే.. వారు ఈ పథకానికి అర్హులు. ఈ మేరకు గతంలో ఆయా కమ్యూనిటీల కార్పొరేషన్లు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పథకం తొలి విడత ఈ రోజు ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఇక, మొదటి విడతలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లోని మొత్తం 3508 మంది లబ్ధిదారులను పథకానికి ఎంపిక చేశారు. ఈ రోజు మంత్రులు వారికి లక్ష రూపాయల చెక్కును అందించనున్నారు. లబ్ధిదారులు ఉదయం 10 గంటలకల్లా కార్పొరేషన్ అందించిన ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డుతో ఎల్బీ స్టేడియానికి రావాలని అధికారులు తెలిపారు. మరి, తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల ఆర్థిక వృద్ధి కోసం ప్రవేశపెట్టిన రూ. లక్ష ఆర్థిక సాయం పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.