iDreamPost
iDreamPost
ఒక భాషలో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమా ఇంకో లాంగ్వేజ్ లో అదే ఫలితం అందుకుంటుదన్న గ్యారెంటీ లేదు. ఒక్కోసారి ఒరిజినల్ ని మించే స్థాయిలో రీమేకులు ఆడితే మరికొన్ని అంచనాలు అందుకోలేక విఫలమవుతాయి. అయితే డబ్బింగ్ చేశాక మళ్ళీ దాన్ని తీయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. ఓ ఉదాహరణ చూద్దాం. 1989లో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ రెండో కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ హీరోగా ‘నంజుండి కళ్యాణ’ అనే సినిమా వచ్చింది. ఎంఎస్ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. లక్షల బడ్జెట్ తో రూపొంది కోట్లు కొల్లగొట్టింది. బెంగళూర్ లాంటి నగరాల్లో ఏకంగా 75 వారాలు ప్రదర్శితమై ఔరా అనిపించింది. ఎక్కడ చూసినా వసూళ్ల జాతరే.
ఇది రాఘవేంద్రకు అప్పటికి రెండో సినిమానే. హీరోయిన్ మాలాశ్రీ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. కట్ చేస్తే దీని ప్రభంజనం చూసి మనవాళ్ళు రీమేక్ చేయాలనుకున్నారు కానీ హీరో తల్లి పార్వతమ్మ తన కొడుకు తెలుగు వాళ్లకూ పరిచయమవ్వాలన్న ఉద్దేశంతో డబ్బింగ్ హక్కులు మాత్రమే అమ్మారు. దాంతో అది కాస్తా ‘నాకు మొగుడు కావాలి’ పేరుతో అనువాద రూపంలో విడుదలైంది. పెద్దగా ఆడలేదు. ఎవరూ పట్టించుకోలేదు. కాని ఇంత పెద్ద హిట్ మూవీ ఇక్కడ కనెక్ట్ కాలేదన్న ఉద్దేశం కలిగి మళ్ళీ ఇంకోసారి తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో విజయబాపినీడు గారు తన పర్యవేక్షణలో వల్లభనేని జనార్ధన్ దర్శకత్వంలో మహాజనానికి మరదలుపిల్లగా ఏడాది తర్వాత రీమేక్ చేశారు.
రాజేంద్ర ప్రసాద్, నిరోషా హీరోహీరొయిన్లుగా సత్యనారాయణ, శ్రీధర్, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, మహర్షి రాఘవ, శ్రీలక్ష్మి తదితర తారాగణంతో మంచి బడ్జెట్ లో తెరకెక్కించారు. కట్ చేస్తే ఇదీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేక జస్ట్ యావరేజ్ గా నిలిచిపోయింది. రెండుసార్లు ఒకే కథను రెండు రూపాల్లో తీసుకొచ్చినా ఫలితం దక్కలేదు. ఒరిజినల్ వెర్షన్ మ్యూజికల్ హిట్టు. అందుకే సంగీత దర్శకుడినీ మార్చకుండా ఉపేంద్రకుమార్ నే తీసుకున్నారు. అయినా లాభం లేకపోయింది. ఇలా కర్ణాటకలో బ్రహ్మరధం అందుకున్న కథ తెలుగులో మాత్రం రెండుసార్లు ఫెయిల్ అయ్యింది. విడిపోయిన రెండు కుటుంబాలను కలపడం కోసం పొగరుబోతైన హీరొయిన్ ని ప్రేమించడం అనే పాయింట్ తో రూపొందిన ఈ సినిమాని బేస్ చేసుకుని అంతకు ముందు ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి