iDreamPost
android-app
ios-app

మాజీమంత్రి కళాకు అధికారుల షాక్

  • Published Feb 24, 2022 | 3:20 PM Updated Updated Feb 24, 2022 | 3:36 PM
మాజీమంత్రి కళాకు అధికారుల షాక్

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు ఆర్థికంగా అనుచిత ప్రయోజనాలు పొందారు. రకరకాల పేర్లతో విలువైన భూములు, ఇతర ప్రభుత్వ ఆస్తులు, రాయితీలు పొందారన్నది వాస్తవం. అందులో భాగంగా పరిశ్రమలు పెడతామంటూ పలువురు నాయకులు కోట్ల విలువ చేసే భూములను కారు చౌకగా మంజూరు చేయించుకున్నారు. కానీ పరిశ్రమలు పెట్టకుండా ఆ భూములను నిబంధనలకు విరుద్ధంగా అమ్మి కోట్లు కూడబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అలా భూములు తీసుకున్న వారిలో మాజీమంత్రి, టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు కూడా ఉన్నారు. ఫ్యాక్టరీ పెడతామంటూ ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు శ్రీకాకుళం జిల్లా అధికారులు గండి కొట్టారు. ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టారు.

రూ. 23 కోట్ల భూమి రూ.40 లక్షలకే

రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకటరావు తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు పేరుతో పరిశ్రమ ఏర్పాటుకు భూమి కావాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేయించారు. సప్తగిరి పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కెమికల్ సాల్వెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని దరఖాస్తులో పేర్కొన్నారు.
ఆయన పార్టీయే అధికారంలో ఉండటంతో ఆ ఫైల్ జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు చకచకా కదిలింది. చివరకు ఆగమేఘాలపై కేబినెట్ మీటింగులోనూ దాన్ని పెట్టి ఆమోద ముద్ర వేయించారు. 2016 ఆగస్టులో రణస్థలం మండలం నారువ గ్రామంలో 7.75 ఎకరాల భూమి కళా తనయుడికి నామమాత్రపు ధరకు కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంతంలో ఎకరా భూమి ధర రూ.3 కోట్ల వరకు ఉండగా రూ.5 లక్షల రేటుకు కట్టబెట్టారు. అంటే రూ.23 కోట్ల భూమిని కేవలం రూ.40 లక్షలకు ధారాదత్తం చేసేశారు.

పునాది రాయి కూడా పడలేదు

రాజకీయ అధికారంతో భూమిని సొంతం చేసుకున్న కళా కుటుంబం ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమి తీసుకున్న మూడేళ్లలో ఫ్యాక్టరీ ప్రారంభించి, నిర్దిష్ట సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పించాల్సి ఉంది. కానీ దాదాపు ఆరేళ్లు అయినా ఆ భూమిలో రాళ్లు రప్పలు తప్ప ఫ్యాక్టరీ కాదు కదా.. కనీసం దాని పునాది రాయి కూడా పడలేదు. పైగా ఆ భూములను అనధికారికంగా అమ్మి సొమ్ము చేసుకునేందుకు కళా కుటుంబం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో ఆలస్యమైనా అధికారులు స్పందించారు. కళా కుటుంబానికి కేటాయించిన భూములను రణస్థలం తహసీల్దార్ సుధారాణి, ఇతర రెవెన్యూ అధికారులు భూములను స్వయంగా పరిశీలించి.. అవి నిరుపయోగంగా ఉన్నాయని నిర్ధారించారు. నిబంధనల ప్రకారం మూడేళ్లలో ఫ్యాక్టరీ పెట్టకుండా నిరుపయోగంగా వదిలేసినందున వాటిని స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేస్తూ తహసీల్దార్ జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపారు. ఆ నివేదిక ఆధారంగా భూమి స్వాధీనానికి కలెక్టర్ కళా కుటుంబానికి నోటీసులు పంపేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.