పొలం​ అమ్మి మరీ భార్యను చదవించిన భర్త.. ఉద్యోగం వచ్చాక ఆమె చేసిన పనికి!

పెళ్లి తర్వాత ఆడవాళ్లు చదువుకోవడం అంటే కల్లే అని చెప్పవచ్చు. ఒకవేళ చదువుకునే అవకాశం ఉన్నా ఎన్నో ఇబ్బందులు దాటాలి. తల్లితండ్రి దగ్గర ఉన్నప్పుడు కేవలం చదువుకోవడం మాత్రమే పని. అదే అత్తారింటికి వెళ్లాక చదువుకోవాలంటే.. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ స్టడీస్‌ కంప్లీట్‌ చేయాలి. రెండు బాధ్యతలను ఒక్కర్తే నిర్వర్తించాలి. మద్దతుగా నిలిచే వారు ఉండరు.. సాయం చేసే వారు కూడా ఉండరు. అయితే అందరికి ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందా అంటే కాదు.. కొందరు భర్తలు, అత్తింటి వారు.. కోడలు చదువుకుంటామంటే ఎంతో ప్రోత్సాహిస్తారు. అడుగడుగునా అండగా నిలుస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే. ఇతగాడు ఏకంగా పొలం అమ్మి మరీ భార్యను చదివించాడు. అనుకున్నట్లే ఆమె బాగా చదివి.. మంచి ఉద్యోగం సంపాదించుకుంది. తనను ఇంతలా ప్రోత్సాహించిన భర్తకు కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి.. ఊహించని షాక్‌ ఇచ్చింది. ఆవివరాలు..

భర్త ఎంతో కష్టపడి తనను చదివిస్తే.. ఉద్యోగం వచ్చాక అతడికి విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది ఓ మహిళ. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌, బారాబంకిలోని సత్రిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్‌పూర్ మజ్రే గల్‌మౌ గ్రామంలో చోటు చేసుకుంది. జైద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాకుత్‌గంజ్ గ్రామానికి చెందిన రామ్‌చరణ్ కుమార్తె దీపికకు 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. అదే ప్రాంతానికి చెందిన అమ్రీష్ కుమార్‌తో ఫిబ్రవరి 20, 2009న దీపిక వివాహం జరిగింది. ఆమెకు చదువు అంటే ఆసక్తి ఉండటంతో.. అమ్రీష్‌ కూడా దీపికను ఆ దిశగా ప్రోత్సాహించాడు. అలా భర్త ప్రోత్సాహంతో.. దీపిక పెళ్లి తర్వాత ఎంఏ, బీఈడీ పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం కోచింగ్‌కు జాయిన్‌ అయ్యింది. అమ్రీషే దగ్గరుండి దీపికను కోచింగ్‌కు తీసుకెళ్లి తీసుకొచ్చేవాడు.

తనకు ఆర్థికంగా భారమైనప్పటికి.. భార్యకు చదువంటే మక్కువ ఉండటంతో.. ఆమెను ప్రోత్సాహించాడు అమ్రీష్‌. ఈ క్రమంలో భార్యను చదవించడం కోసం తనకున్న పొలం కూడా అమ్మేశాడు. దీపక కూడా కష్టపడి చదివి.. 2018లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. ఆమె సాధించిన విజయం చూసి అమ్రీష్‌ పొంగి పోయాడు. అన్నాళ్లు తమను అవమానించిన వారి ముందు కాలర్‌ ఎగరేసుకుని తిరిగాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఊహించని షాక్‌ తగిలింది. ఉద్యోగం వచ్చిన కొన్ని నెలల తర్వాత, దీపిక తన ఎనిమిదేళ్ల కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అక్కడకి వెళ్లాక.. భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ విడాకుల కేసు వేసింది. కుటుంబ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దుర్గ్ నారాయణ్ సింగ్ కేసును విచారిస్తూ.. దీపిక దాఖలు చేసిన విడాకుల దావా నిరాధారమని కొట్టివేసింది.

ఎంతో కష్టపడి.. ఆఖరికి పొలం కూడా తన భార్యను చదివిస్తే.. ఆమె ఇప్పుడు తనకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యిందని.. కనీసం తన కుమార్తెను కూడా కలవడానికి అంగీకరించడం లేదంటూ వాపోతున్నాడు అమ్రీష్‌. అయితే దీపక వాదన మరోలా ఉంది. భర్త అమ్రీష్‌, అతడి కుటుంబ సభ్యులు తనను చాలా హింసించేవారని.. చదువుకోకుండా ఇబ్బందులకు గురి చేసే వారని చెప్పుకొచ్చింది. ఓవైపు ఇంటి పనులు చేస్తూ.. మరోవైపు ప్రైవేట్‌ స్కూల్‌లో ఉద్యోగం చేస్తూ.. ఇంటి ఖర్చులు కూడా తానే చూసుకునేదాన్నని చెప్పుకొచ్చింది. తాను ఎంత చేసినా అత్తింటి వారు తనను హింసించేవారని.. అందుకే కుమార్తెను తీసుకుని పుట్టింటికి వచ్చేశానని అంటుంది.

Show comments