iDreamPost
android-app
ios-app

చంద్రయాన్‌-3 మిషన్‌ కోసం శ్రమించిన ఇద్దరు తెలుగు యువకులు

  • Published Aug 23, 2023 | 12:52 PM Updated Updated Aug 23, 2023 | 2:05 PM
  • Published Aug 23, 2023 | 12:52 PMUpdated Aug 23, 2023 | 2:05 PM
చంద్రయాన్‌-3 మిషన్‌ కోసం శ్రమించిన ఇద్దరు తెలుగు యువకులు

భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. ఈ రోజు మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కానుంది. ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా సాగిన ఈ ప్రయోగం.. అంతిమ దశ ల్యాండింగ్‌ కూడా విజయవంతంగా జరగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. అయితే.. ప్రతిష్టాత్మకమైన ఈ చంద్రయాన్‌-3లో ఇద్దరు తెలుగు యువకులు భాగం అవ్వడం తెలుగువారందరికీ గర్వకారణంగా నిలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్‌ మిసన్‌లో పేలోడ్స్(AHVC, ILSA)కి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్ వేర్ రాశారు. ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతుల కుమారుడు కృష్ణ కుమ్మరి.. పదో తరగతి వరకు ఉండవల్లిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాలలోనే చదవడం విశేషం.

అనంతరం తిరుపతిలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఈ-సెట్ ద్వారా హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. క్యాంపస్‌ నియామకాల్లో టెరా డేటా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో కొన్నేళ్లు పనిచేసి.. ఇస్రోలో ఐసీఆర్బీ పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. 2018లో ఇస్రోలో ఓ యూనిట్ ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ లో గ్రూప్ ‘ఏ’ గెజిటెడ్ అధికారి స్థాయి ఉద్యోగం సాధించారు. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా రెండు పేలోడ్స్ లో ఐదుగురు సభ్యులు పని చేశారు. అందులో LHVC, ILSA కు కృష్ణ డేటా ప్రాసెసింగ్ అనాలసిస్ సాఫ్ట్‌వేర్‌ రాశారు.

ఖమ్మం వాసి..
చంద్రయాన్‌-3 ప్రయోగంలో మరో తెలంగాణ బిడ్డ కూడా భాగం కావడం విశేషం. ఈ మిషన్‌లో ఖమ్మానికి చెందిన శాస్త్రవేత్త ఉమామహేశ్వరరావు ఆపరేషన్‌ మేనేజర్‌గా పనిచేశారు. 2013లో ఇస్రోలో సైంటిస్టుగా చేరిన ఉమా.. వివిధ స్థాయిల్లో పనిచేశారు. బెంగుళూరు కేంద్రంగా ఇస్రోలో ఆపరేషన్‌ డిజైనింగ్‌ విభాగంలో 1500 మందికి పైగా పనిచేస్తుండగా.. అందులో ఆపరేషన్‌ మేనేజర్లుగా 30 మందిని ఎంపిక చేశారు. ఈ 30 మందిలో ఉమామహేశ్వరరావు కూడా ఒకరు. ఇలా దేశం గర్వించదగ్గ ప్రయోగంలో ఇద్దరు తెలంగాణ వాసులు భాగం కావడం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా.. యావత్‌ తెలుగు ప్రజలకే గర్వకారణం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రయాన్‌-3పై పాకిస్తాన్‌ నేత ప్రశంసలు.. తమ దేశంలో ప్రసారం చేయాలంటూ