Dharani
Dharani
కేంద్ర హెం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా పలువరి ఖాతాల్లో 10 వేల రూపాయలు జమ చేశారు. ఎందుకు.. ఏ పథకానికి సంబంధించిన డబ్బులు ఇవి.. అమిత్ షా జమ చేయడం ఏంటి అంటే.. ఇది సహారా గ్రూప్‌కు చెందిన 4 కోఆపరేటివ్ సొసైటీల్లో డిపాజిటర్లు దాచుకున్న డబ్బులు అన్నమాట. శుక్రవారం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. కేంద్రం ఏర్పాటు చేసిన సహారా రీఫండ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారిలో తొలి విడతలో భాగంగా 112 మంది డిపాజిటర్ల ఖాతాలో రూ. 10 వేల రూపాయల్ని జమ చేశారు. ఇప్పటివరకు సుమారు 18 లక్షల మంది రీఫండ్ కోసం పోర్టల్‌లో నమోదు చేసుకోవడం విశేషం. తొలి విడతలో భాగంగా వీరిలో కేవలం 118 మందికి మాత్రమే రీఫండ్ డబ్బుల జమ చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చాలా మంది సహారా కోఆపరేటివ్ సొసైటీల్లో డబ్బులు డిపాజిట్ చేసి.. మోసపోయారు. అయితే వీరందరి సొమ్ము తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్లు క్లెయిమ్ చేసిన నగదు మొత్తాన్ని తిరిగి పొందుతారు. అలానే కోఆపరేటివ్‌ల లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయాలంటే.. వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని తెలిపారు.
సెబీ దగ్గర సహారా గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.24,979 కోట్ల నుంచి సుమారు రూ. 5 వేల కోట్లను తమ డిపాజిటర్లకు చెల్లించేందుకుగాను సుప్రీంకోర్టు.. మార్చిలోనే అనుమతించింది. ఇక డిపాజిటర్లకు నగదు చెల్లించడం కోసం గత నెల 18న అమిత్ షా.. రీఫండ్ పోర్టల్ ప్రారంభించగా డిపాజిటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తొలి విడతలో భాగంగా వీరిలో కొందరి ఖాతాలో రూ. 10 వేల వరకు డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని పెంచుకుంటూ పోతాము అని తెలిపారు.
#WATCH | Union Home and Cooperative Minister Amit Shah transfers the claim amount to the depositors of cooperative societies of the Sahara group through the Sahara Refund Portal in Delhi pic.twitter.com/Hmfm9IqPMP
— ANI (@ANI) August 4, 2023
ఇక ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం కోసం .. ఆధార్ కార్డ్‌తో లింక్ అయిన రిజిస్ట్రేషన్ నంబర్, ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా.. తప్పనిసరిగా ఉండాలి. రీఫండ్ మొత్తం.. ఆయా అకౌంట్లలోనే జమ అవుతుంది. ఏవైనా సమస్యల ఉన్నా లేదంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లొచ్చు. సహారా నగదు రీఫండ్ కోసం https://mocrefund.crcs.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక 45 రోజుల్లోగా డబ్బులు డిపాజిటర్ల అకౌంట్‌లో జమ అవుతాయి. ఇక డిపాజిటర్లు తన బ్యాంక్ అకౌంట్‌లో సహారా రీఫండ్ డబ్బులు పడ్డాయో లేదో మెసేజ్ లేదా ఈమెయిల్ ద్వారా తెలుసుకోగలుగుతారు.