iDreamPost
android-app
ios-app

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. NIA దర్యాప్తులో సంచలన విషయాలు.. సూత్రధారి మాజీ జవాన్ కొడుకు

  • Published Apr 14, 2024 | 4:46 PM Updated Updated Apr 14, 2024 | 4:46 PM

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో అరెస్టైన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒక వ్యక్తి తండ్రి మాజీ జవాన్ అని తెలిసింది. ఆ వివరాలు..

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో అరెస్టైన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒక వ్యక్తి తండ్రి మాజీ జవాన్ అని తెలిసింది. ఆ వివరాలు..

  • Published Apr 14, 2024 | 4:46 PMUpdated Apr 14, 2024 | 4:46 PM
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. NIA దర్యాప్తులో సంచలన విషయాలు.. సూత్రధారి మాజీ జవాన్ కొడుకు

రామేశ్వరం కేఫ్ లో జరిగిన బ్లాస్ట్.. దేశాన్ని కుదిపేసింది. ఇక ఈ కేసు దర్యాప్తును కర్ణాటక హోం శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగించింది. తాజాగా ఈ కేసులో ఎన్ఐఏ ఇద్దరిని అరెస్ట్ చేసింది. కేసులో మాస్టర్ బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్, పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకుంది. ముస్సావిర్ హుసేన్ శాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. కోర్టు వారికి పది రోజుల కస్టడీ విధించింది. నిందితులు బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు పథక రచన చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది.

ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకొచ్చిన నిందితులను మడివాళలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లోని ప్రత్యేక సెల్‌లో ఉంచారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుల్లో ఒకరైన ముసావీర్… నకిలీ ఆధార్, ఐడెంటిటీ కార్డులను సృష్టించి, పేర్లు మార్చుకుని తిరిగినట్టు తేలింది. అలానే ఇద్దరు నిందితులు కోల్‌కతాలో 12 రోజుల పాటు ప్రదేశాలు మారుస్తూ.. తలదాచుకుంటూ వచ్చారని అధికారులు తెలిపారు. తాజాగా ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఇద్దరు ఉగ్రవాదులు.. బాంబుల తయారీ, పేలుడు అనంతరం పారిపోవడం, రూట్ మ్యాప్ రెడీ చేయడంలో సిద్ధహస్తులని అధికారులు తెలిపారు.

తండ్రి సైనికుడు.. కొడుకు ఉగ్రవాది..

ఇక ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఇద్దరిలో ఒకడైన అబ్దుల్ మతీన్ తాహానా గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అబ్దుల్ గ్రాడ్యుయేట్ అని.. మరో ఆసక్తికర అంశం ఏంటి అంటే.. అతడి తండ్రి మాజీ సైనికుడు అని తెలిసింది. అనారోగ్య కారణాలతో అబ్దుల్ తండ్రి గత ఏడాది చనిపోయాడు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అబ్దుల్ ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడు అయినట్లు దర్యాప్తులో తెలిసింది.

ఇక సైనికుడిగా సేవలు అందించిన అబ్దుల్ తండ్రి మన్సూర్ అహ్మద్ రిటైర్మెంట్ తర్వాత కుటుంబం తీర్థహళ్లిలో స్థిరపడింది. స్థానిక చేపల మార్కెట్ సమీపంలో ఓ ఇంటిలో నివాసం ఉండేవారు. అబ్దుల్ తండ్రి జవాన్ గా దేశ భద్రత కోసం పని చేస్తే.. కొడుకు మాత్రం ఉగ్రవాదిగా మారి దేశంలో అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు ప్రధాన కారకుడని అధికారులు వెల్లడించారు. ఇక గతంలో మంగళూరు కుక్కర్‌ బాంబ్‌ పేలుడు, శివమొగ్గ వద్ద బాంబు పేలుడు ఘటనల వెనుక మాస్టర్‌ మైండ్‌ అబ్దులే అని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

తన కుమారుడు ఉగ్రవాదిగా మారిన విషయం తెలిసి అబ్దుల్ తల్లి షాక్‌కు గురయ్యారు. ఇక మరో ఉగ్రవాది ముసావీర్‌ది కూడా తీర్థహళ్లిలో ఓ సాధారణ కుటుంబం. తండ్రి చనిపోవడంతో తల్లి, తోబుట్టువుల కలిసి ఉంటున్నాడు. ముసావీర్, మతీన్‌లు చిన్ననాటి స్నేహితులు.. ఇద్దరూ కలిసి పెరిగారు.