Dharani
Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు ఆయన దేని గురించి మాట్లాడాడంటే..
Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు ఆయన దేని గురించి మాట్లాడాడంటే..
Dharani
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాల మీద దృష్టి పెట్టాయి. ఈ సమయంలో నేతల నోటి నుంచి వెలువడే ప్రతి మాట.. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేదే అయి ఉంటుంది. నేతల మాటల్లో.. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల గురించి చెప్పడమో.. లేక తాము చేయబోయే పనులను ప్రజలకు వివరించడమో జరుగుతుంది. ఇక తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవకే చెందుతాయి. కాంగ్రెస్ విమర్శలపై స్పందిస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిన ఘటన ఏదైనా ఉందా అంటే.. అది దేశంలో ఎమర్జెన్సీ విధించడం. సందర్భం వచ్చిన ప్రతి సారి దీన్ని ఎవరో ఒకరు తెర మీదకు తెస్తూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా రాజ్‌నాథ్ సింగ్ ‘ఎమర్జెన్సీ’ రోజులను గుర్తు చేసుకున్నారు. తనను 18 నెలల పాటు జైలులో పెట్టిన నాటి ప్రభుత్వం.. ఆఖరికి తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా పెరోల్ ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేసిన ‘నియంతృత్వ’ ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. “ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ మరణించింది. బ్రెయిన్ హెమరేజ్‌వల్ల తను చనిపోయింది. ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. అమ్మ చనిపోయిన వార్త తెలిసింది. అంత్యక్రియలకు హాజరు కావడానికి అప్పటి ప్రభుత్వం నాకు పెరోల్ ఇవ్వలేదు. జైలులోనే గుండు గీయించుకున్నాను. అంత కఠినంగా వ్యవహరించారు. అలాంటి వారు (కాంగ్రెస్) ఇప్పుడు మమ్మల్ని నియంతలు అంటున్నారు” అని విమర్శించారు.
ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్‌నాథ్ సింగ్ వయస్సు 24 సంవత్సరాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొనసాగిన జేపీ ఉద్యమంలో ఆయన మిర్జాపూర్-సోన్‌భద్రకు కన్వీనర్‌గా పనిచేశారు. “అప్పుడు నాకు కొత్తగా పెళ్లైంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన నన్ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. ఏకాంత నిర్బంధంలో ఉంచారు” అని రాజ్‌నాథ్ సింగ్ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
ఆసమయంలోనే ఆయన తల్లి అనారోగ్యానికి గురైంది. జైలుకు వెళ్లిన కొడుకు రాకపోవడం.. పైగా ఎమర్జెన్సీని పొడిగించడంతో ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. తల్లి చనిపోయిన విషయం తెలిసి కూడా నాటి ప్రభుత్వం రాజ్‌నాథ్ సింగ్ కు పెరోల్ ఇవ్వలేదు. దాంతో ఆయన తన తల్లి అంత్య క్రియలకు వెళ్లలేకపోయారు. ఆయన సోదరులే అంత్యక్రియలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. తాను జైలులోనే గుండు గీయించుకున్నానని తెలిపారు.