P Krishna
P Krishna
ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన వార్తలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. కొన్నిసార్లు మనం నమ్మలేని నిజాలు కళ్లముందు కనిపిస్తే షాక్ కి గురవుతాం. గతంలో చనిపోయారు అనుకున్నవారు చితిపై కళ్లు తెరిచిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అప్పటి వరకు విషాదంలో ఉన్నవారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. విషపురుగు కుట్టి ఓ వ్యక్తి చనిపోయాడని అనుకున్నారు. శవ పరీక్ష కోసం పోస్టుమార్టానికి తరలించారు.. అంతలోనే జరిగిన సంఘటన చూసి అందరూ షాక్ తిన్నారు. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పంజాబ్ లోని లుథియానాకు చెందిన మన్ ప్రీత్ అనే పోలీస్ అధికారికి విష పురుగు కుటుంది. దాంతో భరించలేని నొప్పితో విలవిలలాడిపోయాడు. మన్ ప్రీత్. తర్వాత ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. శరీరంమంతా ఇన్ ఫెక్షన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. మన్ ప్రీత్ కి వెంటిలేటర్ పై చికిత్స అందించారు వైద్యులు. తమ కుమారుడికి విష పురుగు కుట్టడంతో పరిస్థితి విషమించిందని.. వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చినా మెరుగుపడలేదని తండ్రి రామ్ జీ ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి రిఫర్ చేయాలని వైద్యులను కోరితే… అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని వారు నిరాకరించారని తెలిపారు.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 18న సాయంత్రం మన్ ప్రీత్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి మృతి చెందాడని హాస్పిటల్ వర్గాలు చెప్పారని ఆరోపించారు. ఉదయం పోస్ట్ మార్టం కోసం అంబులెన్స్ లో తరలిస్తుండగా ఓ పోలీస్ కానిస్టేబుల్ మన్ ప్రీత్ శరీరంలో కదలికలను గమనించి వెంటనే డాక్టర్లకు చెప్పాడు. వెంటనే మన్ ప్రీత్ ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మన్ ప్రీత్ చనిపోయాడని తమ సిబ్బంది ఎవరికీ చెప్పలేదని ఆస్పత్రి వైద్యులు చెప్పడం గమనార్హం.