రూ. 150 ఖర్చు.. గంట వెయిటింగ్‌.. కట్‌ చేస్తే కోటీశ్వరుడు!

అదృష్టం బాగోలేకపోతే.. అరటి పండు తిన్నా పళ్లు రాలతాయి.. అదే కలిసి వస్తే.. అర సెకనులో గాల్లో కలిసి పోవాల్సిన ప్రాణాలు సైతం చావును జయించి తిరిగి వస్తాడు. ఈమధ్య కాలంలో చాలా మందిని ఇలా అదృష్టం వరించి.. క్షణాల వ్యవధిలో వారి జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకున్న ఘటనలు అనేక చూశాం. ఇక కేరళలో లాటరీ తగిలి.. ఎందరో పేదలు రాత్రికి రాత్రే కోటీశ్వరులగా మారిన వార్తల గురించి చదివాం. ఇక తాజాగా ఈ కోవకు చెందిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. గంట వ్యవధిలోనే ఓ వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి గంటలోనే అతడి తలరాత ఎలా మారింది.. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

పంజాబ్‌, గురుదాస్‌పుర్‌ జిల్లా హల్కా డేరా బాబా నానక్‌ టౌన్‌కు చెందిన రూపీందర్‌జిత్‌ సింగ్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేస్తుండేవాడు. అతడికి లాటరీ టికెట్‌లు కొనే అలవాటు ఉంది. జీవితంలో త్వరగా కోటీశ్వరుడు కావాలంటే.. లాటరీనే మంచి మార్గం అని భావించాడు. పైగా లాటరీలో కోట్ల రూపాయలు గెలిచి.. రాత్రికి రాత్రి కోటీశ్వరలుగా మారిన వారి గురించి తరచుగా వార్తలు చదువుతుండటంతో.. ఆ కోరిక మరింత పెరిగింది. తన అదృష్టం పరీక్షించుకోవాలని భావించి ఏడాదిగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. దానిలో భాగంగానే శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో.. నాగాలాండ్‌ ఏజెంట్‌ నుంచి 6 రూపాయలకు ఒకటి చొప్పున 25 లాటరీ టికెట్‌లు కొన్నాడు రూపీందర్‌జిత్‌.

అదృష్టం బాగుంటే తాను కొన్న టికెట్‌కు లాటరీ తగులుతుందని భావించాడు. తర్వాత వెళ్లి తన పనిలో నిమగ్నమయ్యాడు. సరిగ్గా గంట తర్వాత అనగా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రూపీందర్‌జిత్‌కు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఎవరో అనుకుని కాల్‌ లిఫ్ట్‌ చేశాడు. అవతల వ్యక్తి కంగ్రాట్యూలేషన్స్‌ సార్‌.. మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారని చెప్పాడు ఏజెంట్‌. ముందు రూపీందర్‌జిత్‌ ఈ మాటలు నమ్మలేదు. తర్వాత లాటరీ టికెట్‌ నంబర్‌ చెప్పాక.. అతడు చెప్పేది నిజమే అని నమ్మకం కలిగింది. కోటీశ్వరుడు కావాలన్న తన కల ఇంత త్వరగా నెరవేరినందుకు చాలా సంతోషించాడు. విషయం తెలిసిన వెంటనే తోటి సిబ్బంది రూపీందర్‌జిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం 150 రూపాయలు ఖర్చు చేసి.. గంటలో కోటీశ్వరుడు అయిన రూపీందర్‌జిత్‌ సింగ్‌ అదృష్టం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Show comments