Krishna Kowshik
Krishna Kowshik
ఆడవాళ్లు ఆకాశంలో సగం, అవనిలో సగం అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. వాస్తవంలో ఇంకా వారి పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అందుకు అతీతం కాదని మరోసారి రుజువు అయ్యింది. అక్కడ ఉన్న ఒకే మహిళా ఎమ్మెల్యే, మంత్రి కేవలం వివక్ష, ధన బలం, రాజకీయ వేధింపులను తట్టుకోలేక తన పదవికి రాజీనామా చేసింది. ఇంతకు ఆమె ఎవరంటే.. చండీరా ప్రియాంగ. ఇంతకు ఆమె ఎక్కడ మంత్రి అంటే. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఏకైక మహిళా, మంత్రి కూడా. కులం, లింగ, కుట్ర, కుంతత్రాలను ఎదుర్కొనలేక ఎఐఎన్ఆర్సీ-బీజెపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంది.
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎన్ఆర్సీ పార్టీ తరుఫున నేడుంకాడు నుండి బరిలోకి దిగి.. శాసన సభ్యురాలిగా ఎన్నికైంది ప్రియాంగ.. 40 ఏళ్ల తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంలో మంత్రి అయిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఎన్. రంగస్వామి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఆమె రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయంలో అందజేశారు. తమకు లేఖ అందినట్లు సీఎంఓ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ రాజీనామాపై ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, తన రాజీనామా లేఖ కాపీని మీడియాకు కూడా పంపారు ప్రియాంగ. అందులో తన రాజీనామాకు సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించారు.
తన నియోజకవర్గంలో ప్రజల్లో తనకున్న ఆదరణ కారణంగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ.. రాజకీయ కుట్రలను అధిగమించడం అంత సులువు కాదని గ్రహించానని, ధన బలం అనే పెద్ద భూతానికి వ్యతిరేకంగా తాను పోరాడలేనని ప్రియాంగ పేర్కొన్నారు. తాను కులతత్వం, లింగ పక్షపాతానికి లోనవుతున్నట్లు పేర్కొన్నారు. తనను టార్గెట్ చేశారని, కుట్ర రాజకీయాలు, ధన బలాన్ని ఎదుర్కోలేక రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రిగా తాను చేపట్టిన శాఖలో తీసుకువచ్చిన మార్పులు, అభివృద్ధి, సంస్కరణలను వివరించేందుకు సవివరమైన నివేదికతో త్వరలో బయటకు వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తాను తన నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు తెలిపారు.