ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశాల్లో ఒకటి ‘సనాతన ధర్మం’ వివాదం. తమిళనాడు మంత్రి, ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలతో ఈ కాంట్రవర్సీ మొదలైంది. సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉన్న సనాతన ధర్మం డెంగీ, మలేరియా, కరోనా లాంటిదన్నారు ఉదయనిధి. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఉదయనిధి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపించాయి. ఉదయనిధి తలను నరికి తీసుకొస్తే రూ.10 కోట్లు ఇస్తానంటూ ఆయోధ్యలోని పరమహంస ఆచార్య స్వామీజీ ప్రకటించడం గమనార్హం.
సనాతన ధర్మం కాంట్రవర్సీపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సనాతన ధర్మాన్ని ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమి అంతం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్లోని బినా పర్యటన సందర్భంగా మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ సంస్కృతిపై దాడి చేయడమే ఇండియా కూటమి వ్యూహమని చెప్పారు. వేల ఏళ్లుగా దేశాన్ని ఒక్కటిగా చేసిన భారత ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాల మీద దాడి చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారంటూ ప్రధాని మోడీ మండిపడ్డారు.
‘ప్రతిపక్ష కూటమి ఇటీవల ముంబైలో సమావేశం నిర్వహించింది. దురహంకారుల కూటమిని నడిపేందుకు వాళ్లు వ్యూహాలను రెడీ చేసుకొని ఉంటారని అనుకుంటున్నా. ఇందులో భాగంగానే దేశ సంస్కృతిపై దాడి చేస్తున్నారు. ఈ దేశ సంస్కృతి, సంప్రదాయాలపై అటాక్ చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ లాంటి వారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని వాళ్లు అంతం చేయాలనుకుంటున్నారు’ అని మోడీ ఫైర్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ విజయవంతం కావడంపై మోడీ స్పందించారు. ఈ సక్సెస్ క్రెడిట్ 140 కోట్ల మంది భారతీయులకు చెందుతుందన్నారు. మన దేశ సామూహిక శక్తికి ఇది ఉదాహరణ అని మోడీ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: బాబు కోసం బయటకొస్తే ఫ్రీ మటన్! రెస్పాన్స్ లేక ఆఖరికి!