iDreamPost
android-app
ios-app

అత్యాచారం కేసులు: ఇకపై వారికి మరణశిక్షే.. తేల్చి చెప్పిన అమిత్‌ షా

  • Published Aug 12, 2023 | 9:36 AM Updated Updated Aug 12, 2023 | 9:36 AM
  • Published Aug 12, 2023 | 9:36 AMUpdated Aug 12, 2023 | 9:36 AM
అత్యాచారం కేసులు: ఇకపై వారికి మరణశిక్షే.. తేల్చి చెప్పిన అమిత్‌ షా

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. పాలు తాగే పసి మొగ్గల నుంచి కాటికి కాళ్లు చాపుకున్న ముసలి వాళ్ల వరకు ఎవరిని వదలడం లేదు మృగాళ్లు. కామంతో కళ్లు ముసుకుపోయి.. వావి వరసలు మరిచి.. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దేశంలో అత్యాచారాలను అరికట్టడం కోసం ఇప్పటికే పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినా.. మృగాళ్లు మాత్రం భయపడటం లేదు. ఈ క్రమంలో మహిళలపై అత్యాచారాల కట్టడికై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసిన నేరస్థులకు మరణ శిక్ష విధిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో వెల్లడించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సందర్భంగా కేంద్రం.. దేశ శిక్ష్మాస్మృతిలో పలు మార్పులు చేయడమే కాక మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బిల్లుల ప్రకారం…పలు నేరాలకు శిక్షను మరింత కఠినతరం చేశారు. ఇక మీదట ఎవరైనా ఆయా నేరాలకు పాల్పడాలంటేనే.. వెన్నులో వణుకు పుట్టించేలా శిక్ష విధించనున్నట్టు అమిత్‌షా ప్రకటించారు.

ఏయేనేరాలకి ఏయే శిక్ష అంటే..

వివాదాస్పద దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామంటూ లోక్‌ సభలో ప్రకటించిన అమిత్ షా…నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా కొత్త బిల్లుని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. మూకదాడుల విషయంలో నేర తీవ్రతను బట్టి మరణశిక్ష విధిస్తామని వెల్లడించారు. ఇక సామూహిక అత్యాచారాలపైనా కొరడా ఝుళిపించింది మోదీ సర్కార్‌. ఈ కేసుల్లో నేరస్థులుగా రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష తప్పదని.. అలానే మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధిస్తామని  మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో స్పష్టం చేశారు.

అలానే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ను భారతీయ న్యాయ్‌ సంహితగా, నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ్‌ నాగరిక్‌ సురక్షా సంహితగా, సాక్ష్యాధార చట్టం స్థానంలో భారతీయ సాక్ష్యా పేరుతో మూడు కొత్త బిల్లలును తీసుకొచ్చింది. ఇవి చట్టరూపం దాలిస్తే.. బాధితులకు గరిష్టంగా మూడేళ్లలోపే న్యాయం జరుగుతుందని ప్రకటించారు. తదుపరి పరిశీలన కోసం ఈ మూడు బిల్లలును స్థాయి సంఘానికి పంపారు. ఇవి శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వస్తాయిని ఆశిస్తున్నట్లు అమిత్‌ షా వెల్లడించారు.