Dharani
సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు బ్రిడ్జీ మీద నుంచి పడిపోయింది. ఆ వివరాలు..
సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు బ్రిడ్జీ మీద నుంచి పడిపోయింది. ఆ వివరాలు..
Dharani
రోడ్డు ప్రమాదాలు ఎంతటి విషాదాన్ని నింపుతాయో.. అనుభవించే కుటుంబాలను అడిగితే తెలుస్తుంది. ఇంటి పెద్దనే ప్రమాదానికి గురైతే.. ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడుతుంది. అప్పటి వరకు ఆనందంగా సాగిన వారి జీవితం.. కుప్పకూలుతుంది. మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. అది కొన్ని దశబ్దాల వరకు వారిపై ప్రభావం చూపుతుంది. ఇక రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం మద్యం మత్తైతే.. ఆ తర్వాత నిద్రమబ్బు, అతివేగం కారణాలవుతున్నాయి. తాజాగా సోమవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రిడ్జీ పై నుంచి పడటంతో.. ఐదుగురు మృతి చెందారు. ఆ వివరాలు..
ఈ విషాదం ఒడిశాలో చోటు చేసుకుంది. జజ్‌పుర్ జిల్లాలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు సోమవారం రాత్రి ప్రమాదానికి గురయ్యింది. బ్రిడ్జిపై నుంచి కిందకు పడిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. ఈ ప్రమాదంలో మరో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకునే సమయానికి బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
సోమవారం రాత్రి బస్సు పూరి నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా.. బారాబతి వంతెన వద్ద రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్ లను రప్పించి గాయపడిన వారిని కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వంతెనపై నుంచి పడటంతో బస్సు నుజ్జునుజ్జయ్యింది. దాంతో బస్సు లోపల చిక్కుకున్నవారిని అతికష్టం మీద బయటకు తీశారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ కట్టర్‌లను ఉపయోగించి బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఈ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. అంతేకాక వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ.3 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. అతివేగం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రయాణికుల వివరాల ఇంకా తెలియాల్సి ఉంది.