ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి గవర్నమెంట్‌ జాబ్స్‌లో నో ఛాన్స్‌!

21వ శతాబ్ధం వచ్చినా.. శాస్త్ర సాంకేతిక పరంగా ఎంత అభివృద్ది చెందినా.. ఆడవాళ్ల పట్ల మాత్రం సమాజం ధోరణి ఇంకా మారలేదు. నిత్యం ఎక్కడోచోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలను తీసుకువచ్చినా.. ఎన్ని శిక్షలు విధించినా ప్రజల్లో మార్పు రావటం లేదు. ఇంటా, బయట మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఓసారి తప్పు చేసి శిక్ష అనుభవించినా.. మళ్లీ అదే తప్పు చేస్తున్న వారు లేకపోలేదు. అలాంటి వారికి సరైన బుద్ధి చెప్పటానికి రాజస్తాన్‌ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

బాలికలు, మహిళలపై అత్యాచారానికి యత్నించినా.. రేప్‌లు చేసినట్లు రుజువైనా వారికి గవర్నమెంట్‌ ఉద్యోగాలు వచ్చే వీలు లేకుండా చేయాలని చూస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ వెల్లడించారు. ఇలా చేయటం వల్ల ఆడవాళ్లపై అకృత్యాలు తగ్గుతాయని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. రాజస్తాన్‌లో శాంతి భద్రతలపై ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఘటనకు సంబంధించిన వివరాలను నమోదు చేసి.. క్యారెక్టర్‌ సర్టిఫికేట్‌ ఇచ్చే సమయంలో నేర వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.

మహిళలు, బలహీనవర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. అత్యాచారాలకు పాల్పడే వారికి సంబంధించి ప్రత్యేక రికార్డులను సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడ్డ వారికి రాష్ట్ర ఉద్యోగాల్లో చోటు లేకుండా చేయాలన్నారు. అంతేకాదు! నిందితులను వేగవంతంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మరి, ఆడవాళ్లపై అకృత్యాలకు పాల్పడేవారికి బుద్ధి చెప్పటానికి రాజస్తాన్‌ ప్రభుత్వం గవర్నమెంట్‌ ఉద్యోగాల్లో వారికి అవకాశం ఇవ్వకుండా చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments