కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి. కిరాణా కొట్టు, హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్.. ఇలా అన్ని చోట్లా పేమెంట్స్ కోసం యూపీఐ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో ఫోన్ ఉంటే చాలు చెల్లింపులు చేసేయొచ్చు. మొబైల్స్‌తోనే ఫాస్టాగ్ రీఛార్జ్ లాంటివి కూడా చేసేయొచ్చు. ఆధునిక టెక్నాలజీ వాడకం వల్లే డిజిటల్ పేమెంట్స్ విషయంలో మన దేశం దూసుకెళ్తోంది. స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్లందరూ తమకేం కావాలన్నా యూపీఐల ద్వారా కొనేస్తున్నారు.
కారు లేదా బైక్‌లో ఫ్యూయల్ పోయించాలన్నా చాలా మంది యూపీఐల ద్వారా లేదా కార్డుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే దీంట్లో కొన్ని కొత్త మార్పులు రానున్నాయి. దిగ్గజ అంతర్జాతీయ సంస్థ అమెజాన్, మాస్టర్ కార్డు మద్దతు ఉన్న టోన్‌ట్యాగ్ అనే కంపెనీ ‘పే బై కార్’ అనే కొత్త డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఆవిష్కరించింది. ఇది యూపీఐ సపోర్ట్‌తో పనిచేస్తుంది. అంటే మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ గానీ, కార్డు గానీ లేకపోయినా కేవలం కారులోని ఇన్ఫోటైన్మెంట్ నుంచే ఇకపై చెల్లింపులు చేసేయొచ్చు. రీసెంట్గా ఎంజీ హెక్టార్, భారత్ పెట్రోలియంతో కలసి ‘పే బై కార్’ చెల్లింపుల వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు కారులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫ్యూయల్ డిస్పెన్సర్ నంబర్‌ను డిస్ప్లే చేస్తుంది. బంక్‌కు రాగానే వాహనదారుడికి అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అదే సమయంలో పెట్రోల్ బంక్ సిబ్బందినీ అలర్ట్ చేస్తుంది. అనంతరం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా ఎంత ఫ్యుయల్ కావాలో ఎంటర్ చేస్తే సరిపోతుంది. ‘పే బై కార్’ సదుపాయంతో ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. చెల్లింపుల తర్వాత అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. రీసెంట్గా గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఎన్పీసీఐతో కలసి యూపీఐలో కన్వర్జేషనల్ పేమెంట్ల సిస్టమ్‌ను టోన్ ట్యాగ్ ఆవిష్కరించింది.
ఇదీ చదవండి: చంద్రబాబు అరెస్ట్‌పై ముందు జోస్యం చెప్పిన వేణు స్వామి!