Dharani
Yaduveer Krishnadatta Chamaraja Wadiyar:
Yaduveer Krishnadatta Chamaraja Wadiyar:
Dharani
దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగుతుండగా.. తెలంగాణలో లోక్ సభ ఎలక్షన్స్ జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎలక్షన్ బరిలో నిలబడే వారంటే.. మినిమం లక్షాధికారులై ఉంటారనే అభిప్రాయం సమాజంలో పాతుకుపోయింది. నూటికి ఒక్కరో ఇద్దరో మాత్రమే సామాన్యులు బరిలో ఉంటారు. వారి పేరు మీద ఆస్తుల కన్నా అప్పులు అధికంగా ఉంటాయి. ఇక తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ మహారాజు తన అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన పేరు మీద కారు, భూమి కాదు కదా కనీసం సొంత ఇల్లు కూడా లేదని వెల్లడించారు. ఇంతకు ఎవరా మహారాజు అంటే..
ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లోని రాజకుటుంబాలకు చెందిన వారసులు పోటీ చేస్తున్నారు. వీరిలో మైసూర్ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ కూడా ఉన్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటి సారి. మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వడంతో ఎన్నికల బరిలో దిగారు.
ఇక సోమవారం నాడు యదువీర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడ్‌విట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తంగా రూ.4.99 కోట్ల మేర ఆస్తులున్నాయని, కానీ, సొంత ఇల్లు, భూమి, కనీసం కారు కూడా లేదని పేర్కొన్నారు. ఈ వివరాలు తెలుసుకున్న వారు ఆశ్చర్యపోతున్నారు. మహారాజు అయ్యుండి కనీసం సొంత ఇల్లు కూడా లేకపోవడమా అని షాకవుతున్నారు జనాలు.
అలాగే, తన భార్య త్రిషిక కుమారీ వడియార్‌కు రూ.1.04కోట్లు, వారి పిల్లలు పేరిట రూ.3.64కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని యదువీర్ తన అఫిడవిట్ లో వెల్లడించారు. అంతేకాక తమ ముగ్గురి పేరుతో ఎటువంటి స్థిరాస్తులు లేవని పేర్కొన్నారు. తన పేరున ఉన్న మొత్తం ఆస్తుల్లో రూ.3.39 కోట్ల మేర నగల రూపంలో ఉన్నట్లు యదువీర్ తెలిపారు. తన భార్యకు రూ.1.02కోట్ల విలువైన ఆభరణాలు, తన సంతానానికి రూ.24.50లక్షల విలువైన నగలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
మైసూరు రాజ్యాన్ని వడియార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్య్రానంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన తర్వాత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ 1974లో రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు. ఆయన కూడా రాజకీయాల్లో పాల్గొన్నారు. 1984-1999 మధ్య కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా నాలుగుసార్లు విజయం సాధించారు.
2013లో నరసింహరాజు కన్నుమూయడంతో యదువీర్ మైసూరుకు 27వ రాజుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. 2016లో దుంగార్‌పుర్ యువరాణి త్రిషికను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు.