ఈ రోజుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలో ఏదో ఒక చోట స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా అంతగా మార్పు కనిపించడం లేదు. ఇకపోతే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడంటూ ఆరోపించారో మహిళా పోలీసు. కావాలనే కక్ష్యపూరితంగా తనను బదిలీ చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆ లేడీ పోలీసు తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ విషయాన్ని తెలిపారు.
ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడంటూ ఆరోపించిన లేడీ పోలీసుపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. కర్ణాటకకు చెందిన లత అనే పోలీసు.. తనను చిక్కమంగళూరు జిల్లాలోని కాడూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఎస్ ఆనంద్ వేధిస్తున్నాడని ఆరోపించారు. రీసెంట్గా జరిగిన రాష్ట్ర ఎన్నికల టైమ్‌లో హెల్మెట్ లేని కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఫైన్ వేశారట పోలీసు లత. ఈ విషయంలో అప్పట్లో ఆమెతో ఎమ్మెల్యే ఆనంద్ వాగ్వాదానికి దిగారట.
కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసు లత జరిమానా విధించడంతో ఆమెతో ఎమ్మెల్యే ఆనంద్ వాగ్వాదానికి దిగిన వీడియో అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారిందట. అయితే ఎలక్షన్స్ తర్వాత లతను కాడూరు స్టేషన్ నుంచి టరికేరి స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ ట్రాన్స్‌ఫర్‌పై ఆమె నిరసన వ్యక్తం చేశారు. తనను కావాలనే కక్ష్యపూరితంగా బదిలీ చేశారంటూ ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఘటనల తర్వాత లత తనను ఎమ్మెల్యే ఆనంద్ వేధిస్తున్నాడని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టారు. ఒకవేళ తనకు ఏమైనా అయితే దానికి ఎమ్మెల్యే ఆనందే కారణమని పేర్కొన్నారు. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ ప్రశాంత్ ఆమెను సస్పెండ్ చేశారు.