iDreamPost
android-app
ios-app

ఆ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. రోజుకు 14 గంటలు పని చేయాల్సిందే..!

  • Published Jul 22, 2024 | 12:14 PM Updated Updated Jul 22, 2024 | 12:14 PM

Karnataka-Techies 14 Work Hours A Day: ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఉద్యోగుల వర్కింగ్‌ అవర్స్‌ను 14 గంటలకు పెంచే దిశగా పావులు కదుపుతోంది. ఆ వివరాలు..

Karnataka-Techies 14 Work Hours A Day: ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఉద్యోగుల వర్కింగ్‌ అవర్స్‌ను 14 గంటలకు పెంచే దిశగా పావులు కదుపుతోంది. ఆ వివరాలు..

  • Published Jul 22, 2024 | 12:14 PMUpdated Jul 22, 2024 | 12:14 PM
ఆ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. రోజుకు 14 గంటలు పని చేయాల్సిందే..!

ఉద్యోగుల పని గంటల పెంపు మీద ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల పని వేళలపై కొన్ని ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు గతంలో అనేక సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. పని గంటలు పెంచాలని అభిప్రాయపడ్డారు. వారిలో చైనా అలీబాబా కంపెనీ హెడ్‌ జాక్‌ మా మొదలు మన ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ అంశంపై తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగుల పని గంటల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇకపై ఆ ఉద్యోగులు రోజుకు 14 గంటలు పని చేయాల్సిందేనంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలు..

ఉద్యోగుల పని గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎక్కడంటే.. కర్ణాటకలో. ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక కోటా బిల్లుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న కర్ణాటక ప్రభుత్వం.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పని గంటలను పెంచేందుకు రెడీ అవుతోంది. వర్కింగ్‌ అవర్స్‌ని ఏకంగా 14 గంటలకు పెంచేలా బిల్లును సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో పెద్ద సంఖ్యలో ఎంఎన్‌సీలు, ఇతర కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీలు.. పని గంటలను పెంచమని కోరుతూ.. ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు పంపడంతో.. తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దాని అమలుకు రెడీ అవుతోందని సమాచారం.

ఐటీ ఉద్యోగుల పని సమయాన్ని 14 గంటలకు పెంచుతూ కర్ణాటక షాప్స్‌ అండ్ కమర్షియల్‌ ఎస్టాబ్లి‌ష్‌మెంట్‌ బిల్లు-2024 (సవరణ)ను తీసుకొచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. దీనిపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ, ఐటీఈఎస్‌, బీపీవోలో ఉద్యోగుల పని గంటలను 12 నుంచి 14 గంటలకు పెంచాలని కర్ణాటక కార్మికశాఖ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఆయా రంగాల్లో 10 గంటల వర్కింగ్‌ అవర్స్‌‌తో పాటు 2 గంటలు ఓవర్‌ టైం (ఓటీ).. మొత్తం 12 గంటలు పని సమయం అమల్లో ఉంది.

అయితే, దీనిని 12 గంటల వర్కింగ్‌ అవర్స్‌, 2 గంటల ఓవర్‌టైం ఉండేలా ప్రతిపాదించగా.. ఈ పని గంటలు వరుసగా 3 నెలల్లో 125 గంటలకు మించరాదని తాజాగా రూపొందించిన బిల్లులో పేర్కొన్నారు. అంతేకాక రెండు గంటల అదనపు సమయానికి వేతనం చెల్లించరు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపాదిత బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే మూడు షిఫ్టుల స్థానంలో రెండు షిఫ్టుల విధానం వస్తుందని పేర్కొంది. దీంతో ఐటీ రంగంలో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల ఉద్యోగుల శారీరక సమస్యలతో పాటుగా మానసికంగా కూడా ఇబ్బంది పడతారని.. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

వ్యతిరేకత నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పని వేళల పెంపు బిల్లుపై నిర్ణయం తీసుకునే ముందు మరోసారి చర్చిస్తామని మంత్రి లాడ్‌ తెలిపారు. ఇటీవల ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.. వారానికి 70 గంటలు పనిచేస్తే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని, పలు దేశాల్లో ఇదే అమలు అవుతోందని కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక మరి కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.