iDreamPost
android-app
ios-app

చంద్రయాన్‌-3 నుంచి చంద్రుడి వీడియో రిలీజ్‌.. నీలి ఆకుపచ్చ రంగులో చందమామ

  • Published Aug 07, 2023 | 11:33 AMUpdated Aug 07, 2023 | 11:33 AM
  • Published Aug 07, 2023 | 11:33 AMUpdated Aug 07, 2023 | 11:33 AM
చంద్రయాన్‌-3 నుంచి చంద్రుడి వీడియో రిలీజ్‌.. నీలి ఆకుపచ్చ రంగులో చందమామ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాది జూలై 14న మన దేశానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ చంద్రయాన్-3ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతంగా ముందుకు సాగుతోంది. చందమామ మీద కాలు మోపడమే లక్ష్యంగా రోదసిలో ప్రయాణం చేస్తోన్న వ్యోమనౌక చంద్రయాన్‌-3 తన టార్గెట్‌ చేరుకునే దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే తన ప్రయాణంలో భాగంగా చంద్రుడికి అతి సమీపంలోకి చేరకున్న స్పేస్‌ క్రాఫ్ట్‌ తాజాగా ఒక వీడియోని రికార్డు చేసి.. పంపించింది. దీనిలో చంద్రుడి ఉపరితలం చాలా స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నీలి ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ.. కనువిందు చేస్తున్నాడు చందమామ.

ఈ వీడియోలో చందమామ చాలా దగ్గర నుంచి కనిపిస్తుండటం విశేషం. చందమామపై ఉన్న లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడులకు సంబంధించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. చంద్రుడి మీద ఉన్న పెద్ద పెద్ద బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్ట్‌ 5న చంద్రయాన్‌ 3 స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినప్పుడు.. మన చందమామ ఇలా కనిపిస్తోంది అంటూ ఇ‍స్రో ఈ వీడియోని షేర్‌ చేసింది. చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ నెమ్మదిగా జాబిల్లికి చేరువవుతంది. ఈ నెల 23న ఇది చంద్రుడిపై ల్యాండ్‌ కానుంది.ఇప్పటికే చంద్రయాన్‌ -3 స్పేస్‌క్రాఫ్ట్‌ మొదటి రౌండ్‌ని పూర్తి చేసింది. మరో ఐదు రౌండ్లు పూర్తి చేసిన తర్వాత చంద్రుడి మీద ల్యాండ్‌ కానుంది.

ఇస్రో జులై 14న చంద్రయాన్ 3 ప్రయోగం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కక్ష్యను పెంచుకుంటూ పోతూ.. ఆగస్టు 1వ తేదీన చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. అనంతరం శనివారం రాత్రి 7 గంటల సమయంలో జాబిల్లికి చేరువగా ఉండే బిందువులోకి ప్రవేశించింది చంద్రయాన్‌ 3 స్పేస్‌క్రాఫ్ట్‌. లూనార్ ఆర్బిట్ ఇనసర్షన్ పక్రియను విజయవంతంగా చేపట్టామని, చంద్రయాన్‌-3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 6 వ తేదీ 11గంటలకు నిర్వహించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17 తర్వాత వ్యోమనౌకను చంద్రుడికి చేరువగా తీసుకువస్తారు. అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి 100 కి.మీల ఎత్తులోకి తీసుకెళ్తారు. తదనంతరం ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ ను ల్యాండ్ చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి