iDreamPost
android-app
ios-app

సామాన్యులకు కేంద్రం భారీ ఊరట.. భారీగా దిగి వచ్చిన శనగపప్పు ధర

  • Published Sep 30, 2023 | 3:54 PM Updated Updated Sep 30, 2023 | 3:54 PM
సామాన్యులకు కేంద్రం భారీ ఊరట.. భారీగా దిగి వచ్చిన శనగపప్పు ధర

గత కొంత కాలంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. మార్కెట్ లో బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనెలు తో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. సంపాదన తక్కువ ఖర్చులు ఎక్కువ కావడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం సామాన్యులకు గుడ్ న్యూస్ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం మార్కెట్ లో కేజీ శనిగపప్పు రూ.90లు ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వద్ద శనిగ నిల్వలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. నిల్వ ఉన్న శనిగ పప్పు ప్రజా పంపిణీ ద్వారా దేశ వ్యాప్తంగా సబ్సీడీపై ప్రజలకు విక్రయించాలని నిర్ణయించింది. తెలంగాణలో హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘానికి ఈ బాధ్యత అప్పజెప్పింది. భారత్ దాల్ పేరుతో అక్టోబర్ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం ద్వారా 50 వేల టన్నుల శనిగ పప్పును విక్రయించనున్నట్లు తెలుస్తుంది. 18 రాష్ట్రాల్లో 5000 సంచార వాహనాల ద్వారా విక్రయాలు చేపట్టనుంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 200 ఆటోల ద్వారా శనిగ పప్పును విక్రయించనున్నారు. ఈ పథకం కింద శనిగపప్పు కిలో రూ.60 రూపాయలకు విక్రయించనున్నారు. 30 కిలోల బస్తా తీసుకుంటే కిలో రూ.55 లకే లభించనుంది.

మార్కెట్ లో కిలో శనిగపప్పు రూ.90 లకు లభిస్తుండగా.. ‘భారత్ దాల్’ పథకం ద్వారా రూ.60లకు లభించనుండటంతో రూ.30 రూపాయలు ఆదా అవుతుంది. సాధారణ వినియోగదారులతో పాటు జైళ్ళు, పోలీస్ శాఖ, ధార్మిక సంస్థలు, దేవాలయాలకు ఈ శనిగ పప్పును విక్రయించేందుకు కేంద్రం అనుమతించింది. మొత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు కొంత వరకు ఊరట లభించనుంది.