Krishna Kowshik
Krishna Kowshik
తరచుగా రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకుని ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఒడిశాలోని బాలా సోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన మర్చిపోక ముందే.. పలు ప్రాంతాల్లో ట్రైన్ యాక్సిడెంట్లు జరిగాయి. పట్టాలు అదుపు తప్పడం లేదా.. మంటలు చెలరేగడం చోటుచేసుకుంటున్నాయి. దీంతో జనాలు అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని రైళ్లల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా బీహార్ లోని బక్సర్ జిల్లాలో ఢిల్లీ-కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటన విదితమే. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. 60 మంది గాయపడ్డారు. తాజాగా మరో ట్రైన్ యాక్సిడెంట్ భయాందోళనకు గురి చేస్తుంది.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో రైలులోఅగ్ని ప్రమాదం సంభవించింది. న్యూ అస్థి నుండి అహ్మదాబాద్ వెళుతున్న రైలులోని ఐదు కోచుల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నారాయణ్ దోహ్.. అహ్మదానగర్ సెక్షన్ మధ్య ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మొదట గార్డ్ సైడ్ బ్రేక్ వ్యానులో మంటలు అలముకుని, నాలుగు కోచ్‌లకు మంటలు అలముకున్నాయని అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడంతో వెంటనే ప్రయాణీకులకు సురక్షితంగా బయటకు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్ల లేదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.