iDreamPost
android-app
ios-app

చంద్రయాన్‌కు ఆ పేరు పెట్టమని సూచించింది.. ఆ మాజీ ప్రధానే

  • Published Aug 23, 2023 | 1:41 PM Updated Updated Aug 23, 2023 | 1:41 PM
  • Published Aug 23, 2023 | 1:41 PMUpdated Aug 23, 2023 | 1:41 PM
చంద్రయాన్‌కు ఆ పేరు పెట్టమని సూచించింది.. ఆ మాజీ ప్రధానే

ఇండియా అ‍త్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చంద్రయాన్‌-3 మరి కొన్ని గంటల్లో.. జాబిల్లిపై దిగనుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు.. భారతీయులే కాక.. యావత్‌ దేశం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో చంద్రయాన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. చంద్రయాన్‌కి ముందుగా అనుకున్న పేరు ఇది కాదట. శాస్త్రవేత్తలు మూన్‌ మిష​న్‌కు ముందుగా సోమయాన్‌ అనే పేరు పెట్టారట. కానీ నాటి ప్రధాని సలహా మేరకు తర్వాత చంద్రయాన్‌గా మార్చారట. ఇస్రో మాజీ ఛైర్‌పర్సన్‌ డా.కె. కస్తూరిరంగన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా కస్తూరిరంగన్‌ మాట్లాడుతూ..‘‘1999లో నేను ఇస్రో ఛైర్మన్‌గా పని చేస్తోన్న కాలంలో.. భారత్‌ చేపట్టే తొలి లూనార్‌ మిషన్‌ ప్రయోగం అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాను. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ.. మిషన్‌కు ఏం పేరు పెడుతున్నారు అని నన్ను అడిగారు. మూన్‌ మిషన్‌కు ‘సోమయాన్‌’ అని పేరు పెట్టాలనుకున్నట్లు మా బృందం వాజ్‌పేయీకి తెలిపాము. సంస్కృతంలో ఓ శ్లోకం ఆధారంగా ఈ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రధానికి వివరించాము. ఈ శ్లోకానికి.. ‘‘ఓ చంద్రుడా.. మేం మా మేధస్సుతో నిన్ను చేరుకోవాలనుకుంటున్నాం. మాకు దారిచూపు’’ అని అర్థం. అందుకే ఆ పేరు పెట్టామని వాజ్‌పేయీకి చెప్పుకొచ్చాం’’ అని కస్తూరిరంగన్‌ గుర్తు చేసుకున్నారు

దీనికి వాజ్‌పేయీ బదులిస్తూ.. లూనార్ మిషన్‌కు ‘చంద్రయాన్‌’ పేరైతే బాగుంటుందని మాకు సూచించారు అని చెప్పుకొచ్చాడు కస్తూరిరంగన్‌. ఈ సందర్భంగా వాజ్‌పేయీ మాట్లాడుతూ..‘‘ఇప్పుడు మన దేశం ఆర్థిక శక్తిగా అవతరిస్తోంది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మరిన్ని యాత్రలు చేయగలిగే సత్తా మనకుంది. అందుకే ఈ మిషన్‌కి చంద్రయాన్‌ అని పేరు పెడితే బాగుటుందని సూచించారు’’ అని గుర్తు చేసుకున్నారు కస్తూరిరంగన్‌.

ఇక ఆ తర్వాత 2003లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వాజ్‌పేయీ చారిత్రక ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ చంద్రయాన్‌ ప్రయోగం గురించి వివరించారు. ‘‘మన దేశం ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి సిద్ధంగా ఉంది. 2008 నాటికి మన వ్యోమనౌకను చంద్రుడిపైకి పంపనున్నాం. ఆ మిషన్‌ పేరు చంద్రయాన్‌’’ అని ప్రకటించారు వాజ్‌పేయీ.

వాజ్‌పేయీ అన్నట్లుగానే.. తొలి చంద్రయాన్‌ ప్రయోగం కోసం ప్రణాళికలు రచించేందుకు ఇస్రోకు నాలుగేళ్లు పట్టగా.. ఆ తర్వాత మరో నాలుగేళ్లకు అంటే.. 2008లో అది చందమామ వద్దకు దూసుకెళ్లింది. చంద్రయాన్‌-1 చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించడంతో ఆ ప్రయోగం విజయవంతమైంది. ఆ తర్వాత 2019లో ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలమైంది. ఆ వైఫల్యాలను అధిగమిస్తూ ఇప్పుడు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 విజయానికి చేరువలో ఉంది.