Tirupathi Rao
Tirupathi Rao
భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు 1962లో ప్రారంభమయ్యాయి. అంతరిక్ష పరిశోధనలకు ఉన్న ఆవశ్యకతను గుర్తిస్తూ జవర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(INCOSPAR)గా ఏర్పడింది. అప్పట్లో కొద్ది మంది ఔత్సాహికులైన శాస్త్రవేత్తలతో ప్రారంభమైంది. ఏర్పడిన తర్వాతి సంవత్సరంలోనే భారతదేశ అంతరిక్ష పరిశోధనలు ఊపందుకున్నాయి. 1963లోనే తొలి ప్రయోగాన్ని చేశారు. ఆ సమయంలో రాకెట్ ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన విడిభాగాలను సైకిల్ మీద తీసుకెళ్లారు.
భారతదేశ తొలి రాకెట్ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ వైరల్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. అప్పడు మొదలైన భారతదేశ అంతరిక్ష పరిశోధనలు ఇప్పుడు ఎవ్వరూ చూడని చంద్రుడి దక్షిణం ధృవం మీద కాలుమోపే వరకు వచ్చాయి. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో పరాజయాలు, ఇంకెన్నో పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు. సైన్స్ లో పరాజయాలు ఉండవు.. కేవలం పాఠాలు మాత్రమే అని చెప్పే మాటలను ఇస్రో ఆగస్టు 23న నిజం చేసి చూపించింది. చంద్రయాన్- 2 వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని కేవలం 4 ఏళ్ల అతి తక్కువ వ్యవధిలోనే చంద్రయాన్- 3 ప్రయోగాన్ని విజయవంతం చేశారు.
ఈ సక్సెస్ తో యావత్ ప్రపంచానికి భారతదేశం ఒక సందేశం పంపినట్లు అయింది. సంకల్పం ధృడంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఇస్రో నిరూపించి చూపించింది. రష్యా 200 మిలియన్ డాలర్ల వ్యయంతో చేసిన లూనా-25 మిషన్ విఫలమవ్వగా.. భారత్ మాత్రం దాదాపు రూ.650 కోట్లతోనే చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే అందరూ అసలు ఇస్రో ఎప్పుడు మొదలైంది? ఇప్పటివరకు ఇస్రో చేసిన ప్రయోగాలు ఏంటి? ఎన్నిసార్లు విజయం సాధించింది అంటూ వెతుకులాట మొదలు పెట్టేశారు. 1962లో మొదలైన భారతదేశ అంతరిక్ష పరిశోధన 2023 వరకు ఎన్నో మైలురాళ్లను అందుకుంది. ప్రపంచ దేశాలకు ఎన్నో సందర్భాల్లో స్ఫూర్తిదాయకంగా మారింది. మరి.. భారతదేశ అంతరిక్ష పరిశోధన మైలురాళ్లను మీరూ చూసేయండి.