iDreamPost
android-app
ios-app

అదే జరిగితే చంద్రయాన్‌ ల్యాండింగ్‌ ఆలస్యం.. వెల్లడించిన ఇస్రో

  • Published Aug 22, 2023 | 9:07 AM Updated Updated Aug 22, 2023 | 9:07 AM
  • Published Aug 22, 2023 | 9:07 AMUpdated Aug 22, 2023 | 9:07 AM
అదే జరిగితే చంద్రయాన్‌ ల్యాండింగ్‌ ఆలస్యం.. వెల్లడించిన ఇస్రో

చంద్రుడిపై అన్వేషణకు భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌కు కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. చందమామపై విక్రమ్‌ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. గతంలో చంద్రయాన్‌ 2 ప్రయోగం సందర్భంగా జరిగిన తప్పులు ఈ సారి రిపీట్‌ అవ్వకుండా ఎంతో జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంది ఇస్రో. అంతేకాక మిగతా దేశాలకు భిన్నంగా ఇస్రో.. విక్రమ్‌ని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ చేయబోతుంది. ఈ క్రమంలో విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అనువైన ప్రదేశం కోసం ల్యాండర్‌ అన్వేషణ మొదలుపెట్టింది. మరి కొన్ని గంటల్లో విక్రమ్‌ ల్యాండింగ్‌ అవుతుందని భావిస్తుండగా.. ఈ మిషన్‌కి సంబంధించి.. ఇస్రో కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా సమస్య తలెత్తితే ల్యాండింగ్‌ ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23న సాయంత్రం 5.45 గంటలకు చందమామపై విక్రమ్‌ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమై.. 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలాన్ని తాకుతుంది. అయితే, ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ప్లాన్ ‘బి’ని అమలు చేయడానికి కూడా ఇస్రో రెడీగా ఉంది. ఏదైనా సమస్య తలెత్తితే.. అప్పుడు ల్యాండింగ్‌ను ఆగస్టు 27కి మార్చనున్నట్లు ఇస్రోకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ) డైరెక్టర్‌ నిలేష్‌ ఎం.దేశాయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘మాడ్యూల్‌ స్థితి, చంద్రుడిపై వాతావరణానికి సంబంధించి ప్రతికూల పరిస్థితులను బట్టి ల్యాండింగ్‌పై నిర్ణయం తీసుకుంటాము. ఆగస్టు 23న ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభానికి 2 గంటల ముందు పరిస్థితిని పరిశీలించిన అనంతరం సమీక్షిస్తాము’’ అన్నారు. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ల్యాండర్‌ స్థితిగతులు, చంద్రుడిపై వాతావారణ పరిస్థితులను ఒకసారి అంచనా వేసి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ, అప్పుడు విక్రమ్‌ ల్యాండ్‌ అయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే జాబిల్లిపై దిగే ప్రక్రియను ఆగస్టు 27కు వాయిదా వేస్తాం. ఒకవేళ ఎలాంటి సమస్యలు తలెత్తకపోతే.. ముందు అనుకున్నట్లు ఆగస్టు 23నే విక్రమ్‌.. చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుంది’’ అని తెలిపారు.

గతంలోలా విఫలం కాకుండా చూసేందుకు..

2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలం కావడంతో ఈసారి అలాంటి పొరపాట్లు.. జరగకుండా చూసుకునేలా.. ఇస్రో పక్కాగా చర్యలు చేపట్టింది. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేలా ల్యాండర్‌ను తీర్చిదిద్దారు. అందుకే చంద్రయాన్‌-3ని ఫెయిల్యూర్ బేస్డ్ విధానంతో రూపొందించారు. అల్గారిథమ్ వైఫల్యం, నియంత్రణ సమస్యల కారణంగా చంద్రయాన్-2 విఫలమైంది. దీని గురించి బెంగళూరులోని ఐఐఎస్సీ ఏరోస్పేస్ సైంటిస్ట్ ప్రొఫెసర్ రాధాకాంత్ పాధి మాట్లాడుతూ.. ‘‘విక్రమ్ ల్యాండర్ కాళ్లు ఇప్పుడు మరింత బలంగా ఉన్నాయి. ద్రయాన్-3ని ‘సిక్స్ సిగ్మా’ ఆధారంగా రూపొందించారు.. ఇది మరింత పటిష్టమైన నిర్మాణం.. అన్ని పరిస్థితులను తట్టుకునేలా ల్యాండర్ రూపకల్పనపై దృష్టి పెట్టారు’’ అని చెప్పుకొచ్చారు