చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమవ్వడం ప్రపంచ దేశాల ముందు భారత్ సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలకు సాధ్యం కానిరీతిలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 సేఫ్‌గా ల్యాండ్ అయింది. దీంతో ఈ విజయం వెనుక ఉన్న ఇస్రో సైంటిస్టులపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలపనున్నారు. ఇప్పటికే ఇస్రో సైంటిస్టులను కలసిన కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రయాన్-3ని సక్సెస్ చేసిన ఇస్రో సైంటిస్టుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మిషన్ కోసం కష్టపడిన శాస్త్రవేత్తలకు ఘనంగా సన్మానం చేయాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఏకంగా 500 మంది ఇస్రో సైంటిస్టులను ఘనంగా సన్మానిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా ప్రకటించారు. బెంగళూరులోని ఇస్రో కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌తో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్, కె.కల్పన, యూఆర్ఎస్సీ డైరెక్టర్ ఎం.శంకరన్‌లను కలసి వారిని అభినందించారు.
ఇస్రోను సందర్శించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఈ సందర్భంగానే చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో పాల్గొన్న 500 మంది సైంటిస్టులను కర్ణాటక ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన తేదీ, తదితర వివరాలను సెప్టెంబర్ 2వ తేదీన చెబుతామన్నారు. కాగా, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. శనివారం ఉదయం బెంగళూరుకు రానున్న ఆయన.. ఆ రోజు ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలను కలసి అభినందనలు తెలపనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.