iDreamPost
android-app
ios-app

ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన చంద్రయాన్‌ 3.. ఇస్రో సరికొత్త చరిత్ర

  • Published Aug 24, 2023 | 9:24 AM Updated Updated Aug 24, 2023 | 9:24 AM
  • Published Aug 24, 2023 | 9:24 AMUpdated Aug 24, 2023 | 9:24 AM
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన చంద్రయాన్‌ 3.. ఇస్రో సరికొత్త చరిత్ర

చంద్రయాన్‌ 3 విజయం చూసి 132 కోట్ల మంది భారతీయల హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. అంతరిక్ష చరిత్రలో ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. మిగతా దేశాలకు భిన్నంగా.. చంద్రయాన్‌ 3 జాబిల్లి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్‌ అయ్యింది. విక్రమ్‌ ల్యాండింగ్‌ వేళ.. కేవలం భారతీయులు మాత్రమే కాక.. యావత్‌ ప్రపంచం ఊపిరి బిగబట్టి.. కనురెప్ప కొట్టకుండా ఆ క్షణాలను వీక్షించింది. విక్రమ్‌ చంద్రుడి మీద ల్యాండ్‌ కాగానే.. దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇస్రో సాధించిన విజయంపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. జాబిల్లి దక్షిణ ధ్రువం చేరుకున్న తొలి దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. ఇదే కాక.. లైవ్‌ స్ట్రీమింగ్‌లో కూడా చంద్రయాన్‌ 3 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆ వివరాలు..

చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ సందర్భంగా.. దేశమంతా అరగంట పాటు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించారు. చంద్రయాన్‌ 3 జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన క్షణాలను దాదాపు 9.1 మిలియన్ల మంది వీక్షించారు. ఇస్రో యూట్యూబ్ ఛానల్‌లో 80,59,688 మందికి పైగా నెజనులు.. విక్రమ్ ల్యాండింగ్‌ని లైవ్‌లో వీక్షించారు. మరోవైపు చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకినప్పుడు ఫేస్ బుక్ లో 3.55 మిలియన్ల మంది నెటిజనులు.. ఈ అద్భుతాన్ని చూశారు.

ఇక దూరదర్శన్ టీవీలో ఎంత మంది చూశారో అధికారిక సంఖ్యలు ఇంకా వెల్లడికాలేదు. అయితే చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకినప్పుడు ఛానెల్ యూట్యూబ్ పేజీని 7,50,822 మంది వీక్షిస్తున్నారు. చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ఇస్రో అధికారిక యూట్యూబ్ ఛానల్‌తో పాటు పలు పేజీలలో విక్రమ్ ల్యాండింగ్ లైవ్‌ స్ట్రీమింగ్‌ని వీక్షించడంతో.. చంద్రయాన్‌ 3 వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేసింది. మొత్తంగా చూసుకుంటే.. సుమారు 9.1 మిలియన్ల మంది చంద్రయాన్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ను వీక్షించినట్లు తెలిసింది.

ఇక గతంలో ఈ రికార్డు బ్రెజిల్‌ వర్సెస్‌ సౌత్‌ కొరియా మ్యాచ్‌ పేరు మీద ఉంది. ఈ మ్యాచ్‌ని 6.15 మిలియన్ల మంది లైవ్‌ స్ట్రీమింగ్‌లో చూశారు. దీని తర్వాత..ఫిఫా వరల్డ్‌ కప్‌ మధ్య పెనాల్టీ డ్రామాను 5.2 మిలియన్ల మంది లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించారు. ఇక తాజాగా చంద్రయాన్‌ ఈ రికార్డులను బద్దలు కొట్టింది.