iDreamPost
android-app
ios-app

Bharat Rice: కేంద్రం గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి భారత్ రైస్.. కిలో రూ.25

  • Published Dec 27, 2023 | 3:49 PM Updated Updated Dec 27, 2023 | 3:49 PM

పెరుగుతున్న బియ్యం ధరకు కళ్లెం వేసేందుకు కేంద్రం ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మార్కెట్ లోకి భారత్ రైస్ ను ప్రవేశపెట్టబోతుంది. ఆ వివరాలు..

పెరుగుతున్న బియ్యం ధరకు కళ్లెం వేసేందుకు కేంద్రం ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మార్కెట్ లోకి భారత్ రైస్ ను ప్రవేశపెట్టబోతుంది. ఆ వివరాలు..

  • Published Dec 27, 2023 | 3:49 PMUpdated Dec 27, 2023 | 3:49 PM
Bharat Rice: కేంద్రం గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి భారత్ రైస్.. కిలో రూ.25

ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు సరిగా కురవలేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఫలితంగా ఈ ఏడాది వ్యవసాయ దిగుబడి తగ్గింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో మార్కెట్లో బియ్యం రేటుకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే ఓపెన్ మార్కెట్ లో కిలో బియ్యం ధర 70 రూపాయలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. పెరుగుతున్న ధరల వల్ల సామాన్యులపై మరింత భారం పడనుంది.

ఈ క్రమంలో బియ్యం ధరల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. బియ్యం ధరల్ని తగ్గించాలని తేల్చి చెప్పింది కేంద్రం. లాభాల కోసం ఎవరైనా ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దాంతో పాటు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది ప్రభుత్వం. భారత్ రైస్ పేరుతో 25 రూపాయలకే కిలో బియ్యం అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ వివరాలు..

ప్రస్తుతం బియ్యం ధరలు గరిష్టాలకు చేరుకున్నాయి. రానున్న కాలంలో రైస్ కు డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు.. అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. నివేదికల ప్రకారం చూసుకుంటే.. ఏడాది కాలంలోనే బియ్యం ధరలు 15 శాతం మేర పెరిగి.. 15 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టే స్థాయిలో నమోదయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో రైస్ ధర కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ నవంబర్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి.

ఎన్నికల వేళ..

అటు చూస్తే మరో నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జనాలు నిత్యావసరాల ధరల పెరుగుదల గురించి గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు బియ్యం ధరలు కూడా పెరగడం.. మోదీ సర్కారుకు సమస్యగా మారనుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం.. కిలో రూ. 25 డిస్కౌంట్ ధ‌ర‌కే బియ్యం అందించేందుకు గాను రెడీ అవుతోంది. దీనిలో భాగంగానే భార‌త్ రైస్‌ ను తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. గోధుమ పిండి, ప‌ప్పుధాన్యాల‌ను.. భార‌త్ ఆటా, భార‌త్ దాల్ పేరిట డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు అందిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో బియ్యాన్ని కూడా చేర్చనున్నారు.

భారత్ ఆటా, దాల్ లిస్ట్ లో భారత్ రైస్..

ఇక ఇప్ప‌టికే భార‌త్ ఆటా పేరిట కిలో రూ. 27.50కి గోధుమ పిండిని, భారత్ దాల్ కింద కిలో శ‌న‌గ పప్పును రూ. 60కి అందిస్తోంది. ఈ ఉత్ప‌త్తుల‌ను ఏకంగా 2000 కు పైగా రిటైల్ పాయింట్స్‌ లో విక్ర‌యిస్తున్నారు. భార‌త్ రైస్‌ ను కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తూ ధ‌ర‌ల స్ధిరీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో భార‌త్ రైస్‌ ను కూడా డిస్కౌంట్ ధ‌ర‌కు నాఫెడ్‌, NCCF, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్స్‌, మొబైల్ వ్యాన్స్ వంటి ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచన చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆహార ధాన్యాల ధరలను స్థిరీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. మ‌రోవైపు ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సైతం దేశీయ మార్కెట్‌లో బియ్యం ల‌భ్య‌త‌ను మెరుగుపరిచేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద రైస్‌ ను ఆఫ‌ర్ చేస్తోంది.

ఆకలి తీర్చుకోవాలంటే అన్నం ఒక్కటి ఉన్నా చాలు. అలాంటిది బియ్యం ధరలే భారీగా పెరిగితే.. అది సామాన్యులకు తలకు మించిన భారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం భారత్ రైస్ ను తీసుకురానుంది. ఇక ప్రభుత్వ నిర్ణయం పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా భారత్ రైస్ ను అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.