iDreamPost
android-app
ios-app

భారత్ అమ్ముల పొదిలో అద్భుతం.. బాహుబలి విమానం గురించి తెలుసా?

భారత్ అమ్ముల పొదిలో అద్భుతం.. బాహుబలి విమానం గురించి తెలుసా?

భారత మిలటరీ అంబుల పొదిలోకి మరో అద్భుతం వచ్చి చేరింది. యుద్ధ నౌకల్లో ప్రసిద్ధి చెందిన సీ-295 యుద్ధ విమానం భారత్‌కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్‌ నెలలో 56 సీ-295 యుద్ధ విమానాలను కొనడానికి స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌ బస్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విమానాల కోసం భారత ప్రభుత్వం ఏకంగా 21,935 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. పాతబడి పోయిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలు ఏవీఆర్‌ఓ-748 విమానాల స్థానంలో వీటిని రంగంలోకి దించనుంది.

ఒప్పందం చేసుకుని దాదాపు రెండేళ్లు పైనే అయింది. ఈ నేపథ్యంలో ఏయిర్‌ బస్‌ సంస్థ మొదటి సీ-295 విమానాన్ని డెలివరీ చేసింది. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీర్‌ చౌదరి ఆ విమానాన్ని తీసుకురావటానికి స్పెయిన్‌ వెళ్లారు. ఈ వారంలో సీ-295 భారత్‌కు రానుంది. అనంతరం అధికారికంగా రంగంలోకి దిగనుంది. ఉత్తర ప్రదేశ్లోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌లో పరుగులు పెట్టనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమానాన్ని ప్రారంభించనున్నారు.

మేడిన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఎయిర్‌ బస్‌ సీ-295

స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌ బస్‌ సంస్థ టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌ బస్‌ కేవలం 16 విమానాలను మాత్రం తయారు చేయనుంది. మిగిలిన 40 విమానాలు ఇండియాలో తయారు కానున్నాయి. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ వీటిని తయారు చేయనుంది. ఇక, ఈ విమానాలు నడిపటం గురించి స్పెయిన్‌లోని సివెల్లోలోనే ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎయిర్‌ఫోర్స్‌ ఫైలట్లతో పాటు 20 మంది సిబ్బందికి కూడా ట్రైనింగ్‌ ఇచ్చారు. మరో మూడు బ్యాచులకు వచ్చే సంవత్సరం ట్రైనింగ్‌ ఇ‍వ్వనున్నారు.

సీ-295 ప్రత్యేకతలు..

సీ-295 రవాణా కోసం వాడే యుద్ధ విమానం. ఇందులో 10 టన్నుల బరువైన వాటిని రవాణా చేయవచ్చు. ఈ విమానం గంటకు 480 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. రియర్‌ డోర్‌ సౌకర్యం ఉంది. విమానం రన్నింగ్‌లో ఉండగానే వస్తువులను, సిబ్బందిని కిందకు దించే అవకాశం ఉంటుంది. ఈ విమానం 71 ట్రూపులను, 50 పారా ట్రూపులను, ఐదు స్టాండర్డ్‌ పాలెట్స్‌ను, 24 హెల్త్‌ కేర్‌ యూనిట్లను రవాణ చేయగలదు. ఈ గాల్లో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యం ఈ విమానంలో ఉంది. అంతేకాదు! స్వల్ప కాలంలో గాల్లోకి ఎగరటం, కిందకు దిగటం.. గడ్డిలో.. చదునుగా లేని మట్టి ప్రాంతాల్లో కూడా ఈ విమానం దిగగలదు. 2,200 అడుగుల ఎయిర్‌ స్ట్రిప్‌ నుంచి కూడా ఈ విమానం టేక్‌ ఆఫ్‌ అవ్వగలదు. మరి, సీ-295 యుద్ధవిమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.