iDreamPost
android-app
ios-app

Ayodhya Ram Mandir: శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం! భక్తులు పులకించిపోతారు!

  • Published Jan 21, 2024 | 1:09 PM Updated Updated Jan 21, 2024 | 1:09 PM

అనేక ప్రత్యేకతలతో అయోధ్య రామ మందిర నిర్మాణం అవుతోంది. ఈ క్రమంలో శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య మందిరంలో అద్భుతం ఆవిష్కృతం అవుతుంది అంటున్నారు. ఆ వివరాలు..

అనేక ప్రత్యేకతలతో అయోధ్య రామ మందిర నిర్మాణం అవుతోంది. ఈ క్రమంలో శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య మందిరంలో అద్భుతం ఆవిష్కృతం అవుతుంది అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Jan 21, 2024 | 1:09 PMUpdated Jan 21, 2024 | 1:09 PM
Ayodhya Ram Mandir: శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం! భక్తులు పులకించిపోతారు!

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రామనామ జపమే వినిపిస్తోంది. మీడియా, సోషల్‌ మీడియా ఇలా ఎక్కడ చూసినా అయోధ్య​ రామ మందిరానికి సంబంధించిన వార్తలు, ఫొటోలే దర్శనం ఇస్తున్నాయి. అవును మరి సుమారు ఐదు దశాబ్దాల నిరీక్షణ తర్వాత.. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం దృశ్యం ఆవిష్కృతం కానుంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అయోధ్య భవ్య మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో తాజాగా రామ మందిరానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రామనవమికి అయోధ్యలో అద్భుతం జరగనుందని.. దాన్ని చూసి భక్తులు పులకించి పోతారని అంటున్నారు. ఆ వివరాలు..

జనవరి 22న ప్రారంభం కాబోతున్న అయోధ్య రామ మందిరాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మిస్తున్నారు. సుమారు వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా, శక్తివంతమైన భూకంపాలను సైతం తట్టుకునేలా ఆలయాన్ని ఎంతో పటిష్టంగా నిర్మిస్తున్నారు. వీటితోపాటు మరో ప్రత్యేకత ఉంది అంటున్నారు. అది ఏంటంటే.. ప్రతీ ఏటా శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది అని చెబుతున్నారు. గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యుడి కిరాణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారని అంటున్నారు. దీన్ని సూర్య తిలకంగా వర్ణిస్తున్నారు. దాంతో ప్రస్తుతం అయోధ్య మందిరంలో ఏర్పాటు చేస్తున్న సూర్య తిలకం విశిష్టతలు ఆసక్తికరంగా మారాయి.

రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో మహా అద్భుతం జరగనుంది. అదే రాముడికి సూర్య తిలకధారణ కార్యక్రమం. నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే ఈ ప్రక్రియ సుమారు 6 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ 6 నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అద్భుతం కోసం వినియోగిస్తున్న ప్రత్యేక టెక్నాలజీని.. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ -సీబీఆర్ఐ రూపొందించింది. దాని కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌-ఐఐఏ సహాయం తీసుకుంది. ఇక దీనికి కావాల్సిన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్స్‌ సంస్థ తయారు చేసిచ్చింది.

సూర్యుడి కిరణాలు రాముడి నుదిటిపై ప్రసరించేలా ప్రత్యేకంగా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేశారు. మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ప్రసరించేలా ఈ పరికరాలను అమర్చారు. అయితే ఈ ఏడాది రామనవమికి ఈ అద్భుతం ఆవిష్కృతం కాదని అధికారులు వెల్లడించారు. ఎందుకంటే ప్రస్తుతం ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని.. మూడు అంతస్థులు పూర్తి అయిన తర్వాతే ఈ అద్భుతం చోటు చేసుకుంటుందని వెల్లడించారు. సూర్య కిరణాలు మూడో అంతస్తుపై నుంచి పడాల్సి ఉన్నందున.. ఆలయ నిర్మాణం 3 అంతస్థులు పూర్తైన తర్వాతే దీన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుందని తెలిపారు. అయితే అయోధ్య రామ మందిరంలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తి కాగా.. 2025 డిసెంబర్ నాటికి మొత్తం 3 అంతస్థులు పూర్తి అవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.