iDreamPost
android-app
ios-app

ఆదిత్య ఎల్1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌ నిగర్ షాజీ ప్రస్థానం.. గవర్నమెంట్‌ స్కూల్‌ నుంచి ఇస్రో దాకా

  • Published Oct 02, 2023 | 5:57 PM Updated Updated Oct 02, 2023 | 5:57 PM
  • Published Oct 02, 2023 | 5:57 PMUpdated Oct 02, 2023 | 5:57 PM
ఆదిత్య ఎల్1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌ నిగర్ షాజీ ప్రస్థానం.. గవర్నమెంట్‌ స్కూల్‌ నుంచి ఇస్రో దాకా

అంతరిక్ష రంగంలో.. భారత్‌ దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ ఏడాది ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. తొలిసారి చంద్రుడి దక్షిణ ధ్రువం మీద విక్రమ్‌ ల్యాండ్‌ అయ్యింది. ఆ తర్వాత ఇస్రో తొలిసారి సూర్యుడి మీద ప్రయోగాల నిమిత్తం ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇస్రో చేపట్టే ప్రయోగాలన్నింటి వెనక ఎందరో శాస్త్రవేత్తల నిరంతర కృషి ఉంటుంది. ఇప్పటికే ఇస్రోలో ఎంతో మంది మహిళలు తమదైన ముద్ర వేస్తుండగా.. తాజాగా ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి ప్రాజెక్ట్ డెరెక్టర్‌గా వ్యవహరించి నిగర్ షాజీ కీలక పాత్ర పోషించారు. ఆమె సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

ప్రభుత్వ పాఠశాలలో చదివి..

అయితే ఆదిత్య ఎల్‌ 1 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నిగర్‌ షాజీ ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో నిగర్‌ షాజీ ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు ఇస్రోలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిగర్‌ షాజీ స్వస్థలం తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా సెంగోట్టై. నిగర్ షాజీ తండ్రి షేక్ మీరాన్, తల్లి సైదు బేవి.

చిన్నతనం నుంచి చదువులో టాపర్‌గా ఉన్న నిగర్ షాజీ.. తెన్‌కాసిలోని ఎస్ఆర్ఎమ్ గవర్నమెంట్ గల్స్ హైస్కూల్‌లో చదివారు. పదో తరగతి, ఇంటర్‌లో ఆమె తెన్‌కాసి జిల్లా టాపర్‌గా నిలిచారు. అనంతరం తిరునల్వేలిలోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌‌లో బీటెక్ పూర్తి చేశారు. తర్వాత బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ పూర్తి చేశారు నిగర్‌ షాజీ.

అంచెలంచెలుగా ఎదుగుతూ..

నిగర్‌ శాజీకి ముందు నుంచి టెక్నాలజీ పట్ల ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే ఆమె బిట్స్ పిలానీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1987లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌-ఇస్రోలో సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. స్పేస్ ప్రాజెక్ట్‌లలో కీలకమైన కమ్యూనికేషన్, శాటిలైట్, డిజైన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో తన సేవలందించారు.

ఆ తర్వాత నేషనల్ రిసోర్స్ మానిటరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఫర్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ రిసోర్స్‌శాట్-2ఏ ప్రయోగానికి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేశారు నిగర్ షాజీ. బెంగుళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన నిగర్ షాజీ.. అంచెలంచెలుగా ఎదిగి చివరికి.. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా సూర్యుడి మీద ప్రయోగాల కోసం ప్రారంభించిన ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అవకాశాన్ని దక్కించుకున్నారు.

ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగం విజయంలో కీలక పాత్ర..

ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయం కావడంలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నిగర్ షాజీ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి డిపార్ట్‌మెంట్‌ను ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగం సక్సెస్‌ తర్వాత నిగర్‌ షాజీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివిన నిగర్ షాజీ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం ఐదేళ్లకు పైగా సేవలు అందిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా సౌర తుఫానులు, జ్వాలలు వాటి పనితీరుపై పరిశోధనలు చేయనుంది.