iDreamPost
android-app
ios-app

Bollywood సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డ బాలీవుడ్

  • Published Apr 26, 2022 | 6:56 PM Updated Updated Apr 26, 2022 | 6:56 PM
Bollywood సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డ బాలీవుడ్

దేశంలోనే కోట్లాది రూపాయల బిజినెస్ తో ముడిపడిన బాలీవుడ్ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది. ఎన్నడూ ఊహించని విధంగా సౌత్ సినిమాల డామినేషన్ విపరీతంగా పెరిగిపోవడంతో హిందీ మూవీస్ లో స్టార్స్ ఉన్నప్పటికీ వాటికి పరాభవం తప్పడం లేదు. అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే, షాహిద్ కపూర్ జెర్సీ ఫలితాల తాలూకు నష్టాలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. సెకండ్ లాక్ డౌన్ అయ్యాక వచ్చిన బెల్ బాటమ్ లాంటివి కూడా డిజాస్టర్ కావడం జీర్ణించుకోలేనిది. దీనికి కారణాలు వెతికితే హిందీ మేకర్స్ అర్బన్ కథల వెంట పడటమేనని విశ్లేషకులు చెబుతున్నప్పటికీ ఇంకా పలు అంశాలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది.

ముఖ్యంగా స్టార్ హీరోలు చాలా నిర్లిప్తంగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ రెండేళ్లకు పైగా ఖాళీ ఉన్నాడు. సల్మాన్ ఖాన్ స్పీడ్ తగ్గించాడు. ఎలాంటి గ్రాఫిక్స్ లేకపోయినా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే వచ్చారు. హృతిక్ రోషన్ వార్ తర్వాత కౌంట్ పెంచలేదు. ఇలా వీళ్లంతా నిమ్మకు నీరెత్తినట్టు ఏళ్ళ తరబడి షూటింగులు చేస్తూ ఉంటే బిసి సెంటర్స్ లో ఉండే మాస్ ఆడియన్స్ కి సౌత్ చిత్రాలు ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తున్నాయి. అందుకే పుష్ప పార్ట్ 1ని ఆ స్థాయిలో రిసీవ్ చేసుకున్నారు. పార్ట్ 2 మీద డిమాండ్ ఓ రేంజ్ లో ఉండటానికి ఇంత కన్నా వేరే ఎగ్జాంపుల్ ఏం కావాలి.

ఇక కెజిఎఫ్ 2 కథ సరేసరి. బాహుబలి 2ని టార్గెట్ చేసేలా సునామి కలెక్షన్లతో వణుకు పుట్టిస్తోంది. దీని దెబ్బకు 29న వస్తున్న రన్ వే 34, హీరోపంటి 2లు కిందా మీద పడుతూ ఆలోచించాయంటే పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వేళ ఆచార్య, సర్కారు వారి పాట కనక ఇక్కడ హిట్ అయితే వెంటనే హిందీ డబ్బింగులు దింపేసి క్యాష్ చేసుకుంటారు. రాను రాను ఉత్తరాది ప్రేక్షకులకు మన హీరోలు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఎంతగా అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, యష్ లకు స్వంతంగా ఫ్యాన్ క్లబ్ లు ఏర్పడేంతగా. మరి బాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చే అక్కడి స్ట్రెయిట్ మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి.