iDreamPost
android-app
ios-app

రాకేష్‌ మాస్టర్‌ పెద్ద కర్మ నిర్వహించిన శిష్యులు.. తప్పుడు వార్తలు రాయకండి అంటూ!

  • Published Jun 28, 2023 | 6:28 PM Updated Updated Jun 28, 2023 | 6:28 PM
  • Published Jun 28, 2023 | 6:28 PMUpdated Jun 28, 2023 | 6:28 PM
రాకేష్‌ మాస్టర్‌ పెద్ద కర్మ నిర్వహించిన శిష్యులు.. తప్పుడు వార్తలు రాయకండి అంటూ!

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్‌ మాస్టర్‌, గణేష్‌ మాస్టర్‌, సత్య మాస్టర్‌ వంటి వారు.. గతంలో రాకేష్‌ మాస్టర్‌ శిష్యులే. ప్రస్తుతం వీరంతా టాప్‌ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. శిష్యులు ఉన్నత స్థానాలకు చేరితే.. రాకేష్‌ మాస్టర్‌ మాత్రం.. అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఈ క్రమంలో రాకేష్‌ మాస్టర్‌ మృతి తర్వాత.. పలు యూట్యూబ్‌ చానెల్స్‌ ఆయన శిష్యులైన శేఖర్‌ మాస్టర్‌, సత్య మాస్టర్‌ల మీద విమర్శలు చేస్తూ.. వీడియోలు చేశారు. వీరంతా రాకేష్‌ మాస్టర్‌ బతికున్నప్పుడు ఆయనను ఆదుకోలేదు కానీ.. ఆయన మృతి చెందిన తర్వాత.. వచ్చి షో చేస్తున్నారంటూ వార్తలు రాసుకొచ్చారు. ఈ క్రమంలో రాకేష్‌ మాస్టర్‌ శిష్యులు శేఖర్‌ మాస్టర్‌, సత్య మాస్టర్‌లు నేడు ఆయన పెద్ద కర్మ జరిపించారు. ఈ సందర్భంగా శేఖర్‌ మాస్టర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు…

ఈ సందర్భంగా శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. ఎవరు ఏమనుకున్నా.. రాకేష్‌ మాస్టర్‌ మా గురువు.. ఆయనకి ఏం చేశామో మాకు మాత్రమే తెలుసు అంటూ తమపై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌‌కి కౌంటర్ ఇచ్చారు.శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘మాస్టర్ గారితో నా జర్నీ.. దాదాపు ఎనిమిదేళ్లు సాగింది. అప్పుడు మాకు బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. హైదరాబాద్ వచ్చిన తరువాత.. ఈ మహానగరంలో మాకు ఎవరూ తెలియదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఇప్పుడు ఆయన (రాకేష్ మాస్టర్) డాన్స్‌లు యూట్యూబ్‌లలో చూస్తున్నారు. మీరు చూసేది ఆయనలో 5 పర్సంట్ మాత్రమే. ఆయన చాలామంచి డాన్సర్.. ఆయన స్టైయిల్‌ని నేను చాలా దగ్గర నుంచి చూశాను’’ అని చెప్పుకొచ్చారు.

‘‘నేను చిన్నప్పుడు ప్రభుదేవా మాస్టర్‌ని చూసి ప్రభావితం అయ్యాను. హైదరాబాద్ వచ్చిన తరువాత నాకు ఆ స్టైల్.. మళ్లీ రాకేష్ మాస్టర్‌లో కనిపించింది. ఆయన ఇప్పుడు.. చివరి రోజుల్లో చేసిన డాన్స్ కాదు.. మేం ఆయన దగ్గర ఉన్నప్పుడు చేసిన డాన్స్‌లు చాలా ప్రత్యేకం. ఆయన మా గురువు అని చాలా గౌరవంగా చెప్పుకుంటాం. డాన్స్ నేర్పించడంలో ఆయనలో చాలా పర్ఫెక్షన్ కనబరిచేవారు. చిన్న తేడా వచ్చినా ఒప్పుకునేవారు కాదు. ఆయన ఎప్పుడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకున్నాం. కానీ ఇలా అవుతుందని.. ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్తారని కలలో కూడా ఊహించలేదు. ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను’’అన్నారు.

‘‘మాస్టర్‌గారి పెళ్లి చేసింది కూడా మేమే.. నా చేతుల మీదుగానే ఆయన పెళ్లి జరిగింది. మాస్టర్ డైరెక్షన్ కోసం తిరుగుతున్నప్పుడు.. మేం బయటకు వచ్చి కొరియోగ్రాఫర్లుగా ఎదిగాం. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు ఏవేవో తంబ్ నెయిల్స్ పెట్టి.. ఏవేవో వీడియోలు వేస్తున్నారు. మీ వల్ల చాలా కుటుంబాలు బాధపడతాయి. అది అర్ధం చేసుకోండి. వాస్తవాలు తెలిస్తేనే వార్తలు రాయండి.. తప్పుడు వార్తలు మాత్రం రాయకండి. రాకేష్‌ మాస్టర్‌ ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం’’ అని తెలిపాడు శేఖర్‌ మాస్టర్‌.