Venkateswarlu
నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారండోజ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, కొరటాల శివ తదితరులను కలిశారు.
నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారండోజ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, కొరటాల శివ తదితరులను కలిశారు.
Venkateswarlu
గత మూడు రోజులుగా నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారండోజ్ హైదరాబాద్‌లో మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆయన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ అవుతూ ఉన్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లను ఆయన కలిశారు. రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ చిరు, చరణ్‌లతో సమావేశం అయ్యారు. మెగా అల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు కూడా టెడ్‌తో ముచ్చటించారు. చిరు కుటుంబంతో మీటింగ్ తర్వాత..
నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం జూ.ఎన్టీఆర్ ఇంట్లోనే భోజనం చేశారు. అక్కడ కళ్యాణ్ రామ్, కొరటాల శివతో పాటు మరికొందరు కూడా టెడ్‌తో సమావేశం అయ్యారు. మెగా, నందమూరి ఫ్యామిలీలను కలిసిన తర్వాత .. అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, దగ్గుబాటి, అక్కనేని ఫ్యామీలీ సభ్యులతోనూ టెడ్ సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
‘‘టాలీవుడ్‌లోని దిగ్గజ సినిమా వాళ్లను కలవటానికి నేను హైదరాబాద్‌లో 3 రోజులు ఉన్నాను. సినిమా పట్ల వాళ్లకు ఉన్న భక్తికి నా మతిపోయింది. జీవితంలో ఒక సారి వచ్చే అనుభవం. మళ్లీ తిరిగిరావడానికి ఎదురు చూస్తున్నా..’’ అని పేర్కొన్నారు. టెడ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులను కలిసిన దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారండోజ్ హైదరాబాద్‌కు రావటం.. టాలీవుడ్ సినీ సెలెబ్రిటీలను కలవటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎందుకు వచ్చారు? సెలెబ్రిటీలతో ఏం మాట్లాడారన్నది కూడా తెలియరాలేదు. అయితే, టెడ్ పర్యటనపై సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమ్ అయింది. రికార్డులు క్రియేట్ చేసింది.
ఇందుకు గానూ దర్శకుడితో పాటు హీరోలకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారట. పనిలో పనిగా.. భవిష్యత్ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని వచ్చారట. ఇప్పుడు మీట్ అయిన కొంతమంది హీరోలు, దర్శకులతో నెట్‌ఫ్లిక్స్ సినిమాలు తీసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా స్ట్రీమింగ్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇలా బజ్ ఉన్న సినిమాల స్ట్రీమింగ్ హక్కుల కోసం కూడా టెడ్ పావులు కదుపుతున్నారట.
బాలీవుడ్‌ను కాదని.. టాలీవుడ్‌కు ఎందుకు?
ఒకప్పుడయితే, ఈ ప్రశ్నకు ‘‘ దేశంలో బాలీవుడ్ నెంబర్ వన్ కాబట్టి అందుకే..’’ అన్న సమాధానం వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్యాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. తెలుగు సినిమాలు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చాటుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఇండియన్ సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇవి రెండు కూడా తెలుగు సినిమాలే.
దీనికి తోడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్‌ను సైతం సొంతం చేసుకుంది. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. అంతకన్నా ముఖ్య విషయం ఏంటంటే.. తెలుగు వారు సినిమా ప్రియులు.. ఓటీటీని వాడుతున్న వారిలో తెలుగు వారే ఎక్కువ. మార్కెట్ పరంగా బాలీవుడ్ కంటే టాలీవుడ్ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. టాలీవుడ్‌నుంచి మంచి మంచి కంటెంట్ ఓటీటీలోకి వస్తోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టెడ్ బాలీవుడ్‌ను కాదని టాలీవుడ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.