Dharani
Dharani
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్.. రాకేష్ మాస్టర్.. ఆదివారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం రాకేష్ మాస్టర్.. వైజాగ్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఇలా ఉండగానే చికిత్స పొందుతూనే.. ఆదివారం సాయంత్రం ఆయన కన్నుమశారు. రాకేష్ మాస్టర్ మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాకేష్ మాస్టర్ మృతి నేపథ్యంలో.. గతంలో ఆయన పలు యూట్యూబ్ చానెల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రాకేష్ మాస్టర్.. మరణం, తన అంత్యక్రియల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
గతంలో రాకేష్ మాస్టర్ ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో.. తన జీవితంలో చోటు చేసుకున్న విషాదకర సంఘటనల గురించి వెల్లడించాడు. తన వాళ్లంతా వరుసగా మృతి చెందడంతో.. జీవితం మీద విరక్తి కలిగిందని తెలిపాడు. రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘నాకు చావంటే భయం లేదు. ఎందుకంటే జీవితంలో నా అనుకున్నవాళ్లు వరుసగా మృతి చెందారు. ముందు నా తమ్ముడు మృతి చెందాడు.. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ బాధ నుంచి త్వరగా బయపడలేకపోయాను. ఆ తర్వాత మా అమ్మ, నా అక్క కుమారుడు మృతి చెందాడు. ఆ తర్వాత మా నాన్న చనిపోయాడు. ఇవన్ని చూసిన తర్వాత నాకు చావు అంటే భయం పోయింది. కానీ ఎవరైనా ఫోన్‌లో చావు గురించి చెబితే.. భయం వేసేది’’ అన్నాడు.
‘‘జీవితంలో ఏది శ్వాశతం కాదు. ఈ ఇల్లు, మన శరీరం.. ఆస్తులు ఏవి శాశ్వతం కాదు. మట్టిలో కలిసిపోయేదే పర్మినెంట్. మనమందరం ఏదో ఒక రోజు చనిపోవాల్సిన వాళ్లమే. నేను చనిపోయిన తర్వాత నా అంతిమయాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి.. అందుకు సంబంధించని వీడియో తీశాను. అలానే నా అంత్యక్రియలకు సంబంధించి ఓ కోరిక ఉంది. నా భార్య తండ్రి అంటే మా మామగారు మృతి చెందినప్పుడు.. ఆయన సమాధి పక్కన నేను ఒక వేప మొక్క నాటాను. దాన్ని పెంచుతున్నాను. ఇక నేను చనిపోతే.. ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండి’’ అని కోరాడు రాకేష్ మాస్టర్. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.