TFCC ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. ఈసారి దిల్ రాజు, సీ కల్యాణ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. గెలిచేందుకు ఇద్దరూ తీవ్రంగా కృషి చేశారు. జనరల్ ఎలక్షన్స్ తరహాలోనే ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం చూశాం. ఈ ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హడావుడి చూస్తుంటే సంతోష పడాలో.. సిగ్గు పడాలో కూడా అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “నేను చాలా ఎన్నికలు చూశాను. నేను ప్రెసిడెంట్ గా కూడా చేశాను. కానీ, ఈ ఎన్నికల వాతావరణం చూస్తుంటే.. ఛాంబర్ ఎదిగిందని సంతోష పడాలో, సాధారణ ఎన్నికల తరహాలో ఉందని సిగ్గు పడోలా అర్థం కావడం లేదు. అసలు సభ్యులు అందరూ దేనికి పోటీ పడుతున్నారు? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియట్లేదు. భవిష్యత్ లో మాత్రం ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను” అంటూ తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.

ఎన్నికల విషయానికి వస్తే.. జులై 30 ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తాయి. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్టిబ్యూటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ అంటూ మొత్తం నాలుగు విభాగాల్లో సభ్యులు పోటీ పడుతున్నారు. 4 సెక్టార్లలో కలిపి మొత్తం 1600 మంది సభ్యులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 900 వరకు ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. ఈసారి ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే సీ కల్యాణ్- దిల్ రాజు తీవ్ర ఆరోపణలు చేసుకోవడమే ఇందుకు కారణం. ఎవరిపై ఎవరు విజయం సాధిస్తారంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show comments