iDreamPost
android-app
ios-app

ఈసారి ఉత్తములు, అర్హులకు మాత్రమే నంది అవార్డులు: పోసాని

  • Published Jul 04, 2023 | 7:39 PM Updated Updated Jul 04, 2023 | 7:39 PM
  • Published Jul 04, 2023 | 7:39 PMUpdated Jul 04, 2023 | 7:39 PM
ఈసారి ఉత్తములు, అర్హులకు మాత్రమే నంది అవార్డులు: పోసాని

మనం చేసే పనికి ప్రశంసలతో పాటు.. అవార్డులు, రివార్డులు లబిస్తే.. ఆ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అన్నాళ్ల పడ్డ శ్రమ.. అవార్డు అందుకున్న మరుక్షణం మాయం అవుతుంది. మన సమాజంలో అవార్డులు ఎక్కువగా వచ్చే రంగం సినిమా రంగం. జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు ఇస్తారు. అలానే రాష్ట్రాల వారిగా కూడా అవార్డులు అందజేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టాలీవుడ్‌కి సంబంధించి నంది అవార్డులు ఇచ్చేవారు. ఈ అవార్డును చాలా ప్రతిష్టాత్మకంగా భావించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీలో నంది అవార్డు ఇచ్చారు. కానీ వాటి మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కులం, ప్రాంతం ప్రతిపాదికన అవార్డులు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని రోజుల క్రితం పలువురు సెలబ్రిటీలు నంది అవార్డులపై వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈ టాపిక్‌ మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలోనే త్వరలోనే నంది అవార్డులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, నటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు.

ఈ సారి నంది అవార్డులు ఇచ్చే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు అప్పగించారని పోసాని తెలిపారు. ఈసారి ఉత్తములు, అర్హులకు మాత్రమే అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. డ్రామా, టీవీ, సినిమా రంగాలు అవార్డులు ఇస్తామని.. కానీ అందరికి ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. మొదటగా పద్య నాటకాలకు నంది అవార్డులు అందించి.. ఆ తర్వాత మిగతా రంగాల వారికి అవార్డులు ప్రధానం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 1998-2004 వరకు నంది అవార్డులు అందజేశారు. కానీ అవి కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అయ్యాయి. చంద్రబాబు నాయడు సీఎంగా ఉన్నప్పుడు నంది అవార్డులు ఇస్తామని చెప్పి.. రద్దు చేశారు. సీఎం జగన్‌ ఈసారి నంది అవార్డులు ఇవ్వాలని భావించారు. ఆ బాధ్యతను నాకు అప్పగించారు’’ అని తెలిపారు.

‘‘ఈసారి నంది అవార్డుల ఎంపికలో ఎలాంటి వివక్ష లేకుండా.. నిజాయితీగా. అర్హులకు మాత్రమే అవార్డులు అందజేస్తాం. ఏపీలో ఎవరైనా ఫ్రీగా షూటింగ్‌లు జరుపుకోవచ్చు. స్టూడియోలు కడితే సహకరిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఏపీలో సినిమా రంగం అభివృద్ధి కోసం సీఎం జగన్‌ ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు’’ అని తెలిపారు. నాటక రంగానికి సంబంధించి నంది అవార్డుల నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఉంటుంది. అలానే ఉపసంహరణకు నెల రోజుల గడువు ఇస్తామని తెలిపారు. మొత్తం ఐదు క్యాటగిరీల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. పద్య, సాంఘిక, యువ, పిల్లల నాటకాలు ఇలా అన్ని కలిపి మొత్తం 73 అవార్డులు ఇస్తామని తెలిపారు.