iDreamPost
android-app
ios-app

ముగింపుకొచ్చిన సర్కారు పాట కథ

  • Published Jun 06, 2022 | 1:10 PM Updated Updated Jun 06, 2022 | 1:10 PM
ముగింపుకొచ్చిన సర్కారు పాట కథ

సర్కారు వారి పాట ఫైనల్ రన్ కు వచ్చేసినట్టే. మొదట్లో బాగా హడావిడి చేసి పన్నెండు రోజులకే 200 కోట్ల గ్రాస్ వచ్చిందని చెప్పుకున్న నిర్మాతలు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఉహించని విధంగా రెంటల్ పద్ధతిలో నాలుగో వారంలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేయడంతో ఇప్పటికే తగ్గిపోయిన కలెక్షన్లు మరింత ప్రభావితం చెందాయి. జూన్ 23 నుంచి ఎలాంటి అదనపు ఛార్జ్ లేకుండా ఆ ఓటిటి సభ్యులకు ఫ్రీగా అందుబాటులోకి తెచ్చే విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. సో ఇక ఆశించడానికి ఏమి లేదు. ఉన్నంతలో మెయిన్ సెంటర్స్ వీకెండ్స్ లో వసూళ్లు వస్తున్నాయి కానీ మిగిలిన రోజుల్లో చెప్పుకోదగ్గ డెఫిషిట్లు పడుతున్నాయి

నిజంగానే సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ అందుకుందా లేదానే దాని మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్థమవుతూనే ఉన్నాయి. సుమారు 125 కోట్ల షేర్ ని టార్గెట్ గా పెట్టుకుని బరిలో దిగిన ఈ సినిమా అది రీచ్ అవ్వడంలో తడబడినందు వల్లే మైత్రి సంస్థ ఎర్లీ ఓటిటి రూపంలో నష్టాన్ని తగ్గించుకుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈ మధ్యే జోడించిన మురారివా పాట కూడా ఏమంత ప్రయోజనం కలిగించినట్టు కనిపించడం లేదు. తమన్ ట్వీట్లు పెట్టడం మినహా మహేష్ ప్రత్యేకంగా దాని గురించి చెప్పింది లేదు. రోజువారీ రెవిన్యూని యూనిట్ అధికారికంగా ప్రకటించడం కూడా ఆపేసింది. కారణాలు తెలియదు.

దీనికి తోడు మహేష్ టీమ్ పూర్తిగా తమ నిర్మాణంలో రూపొందిన మేజర్ ప్రమోషన్ కు అంకితమైపోవడంతో సర్కారు వారి పాట సందడి జీరోకు వెళ్లిపోయింది. సినిమాలో కంటెంట్ సంగతి ఎలా ఉన్నా సూపర్ స్టార్ ఇమేజ్ థియేటర్లకు ఆడియన్స్ వచ్చేలా చేసింది. ఇదే టాక్ తో ఇంకెవరైనా అయ్యుంటే సీన్ వేరేలా ఉండేది. కానీ దాన్నో నెల రోజుల పాటు హోల్డ్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో నిజంగా ఈ సినిమా సూపర్ హిట్ అనాలా వద్దా అనే అయోమయాన్ని సృష్టించేశారు. మరి చివరి పాట అయ్యాక ఎంత లెక్క ఉంటుందో చూడాలి. వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కల్లో కనీసం ఓ పది కోట్ల దాకా నష్టం మిగలొచ్చని అంటున్నారు కానీ ఇంకో వారం అయ్యాక క్లారిటీ వస్తుంది