P Krishna
P Krishna
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శక, నిర్మాతలు, నటీనటులు వారి కుటుంబ సభ్యులు పలు కారణాల వల్ల కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. గుండెపోటుతో, రోడ్డు ప్రమాదాలు, కెరీర్ ఇబ్బందుల వల్ల బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. మాలీవుడ్ నటుడు మారి ముత్తు మరణం మర్చిపోకముందే.. మాలీవుడ్ దర్శకుడు కేజీ జార్జ్ కన్నుమూశారు. నటి, దర్శక నిర్మాత జయదేవి మరణించారు. ఈ విషాదాలు మరువక ముందే ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ మాలీవుడ్ సినీ నిర్మాత, మాతృభూమి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ పి.వి. గంగాధరన్ అక్టోబర్ 13 ఉదయం కోజికోడ్‌లో గంగాధరన్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. వృద్దాప్య కారణంగా తీవ్ర అస్వస్థతతో వారం రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. పివిజి అని పిలుచుకునే శ్రీ గంగాధరన్ సినిమా, రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రియాశీల సభ్యుడు, అతను 2011లో కోజికోడ్ నార్త్ నియోజకవర్గం నుండి కేరళ శాసనసభ ఎన్నికలలో పోటీ చేశాడు. పి.వి. గంగాధరన్ గృహలక్ష్మి ప్రొడక్షన్స్ ద్వారా మలయాళంలో ఎన్నో అద్బుతమైన చిత్రాలు నిర్మించారు.
ఆయన నిర్మించిన చిత్రాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. 1977 లో సుజాత సినిమాతో కెరీర్ ప్రారంభించారు. అంగడి, అహింస, చిరియో చిరి, కట్టాతే కిలిక్కోడు, వార్త, అద్వైతం, ఏకలవ్యం లాంటి హిట్ సినిమాలు తీశారు. ఆయన తీసిన ‘సంతం’ మూవీకి ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు లభించింది. పారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్ (FIAPF) ఉపాధ్యక్షుడిగా, కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, కేరళ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశాడు. పి.వి. గంగాధరన్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.