సినీ పరిశ్రమలో ఒకట్రెండు సినిమాలతో ఓవర్‌నైట్ స్లార్లు అయిపోయినవాళ్లు చాలా మందే ఉన్నారు. అదే సమయంలో పదుల కొద్దీ సినిమాలు చేస్తూ, ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగినా స్టార్ స్టేటస్ దక్కించుకోని దురదృష్టవంతులూ ఉన్నారు. ‘తీన్మార్’ మూవీ ఫేమ్ హీరోయిన్ కృతి కర్బందా కూడా అదే కోవలోకి వస్తారని చెప్పొచ్చు. ‘బోణీ’ అనే తెలుగు చిత్రంతో 2009లో తెరంగేట్రం చేశారీ భామ. కానీ ఆ మూవీ అంతగా ఆడలేదు. ఆ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘తీన్మార్’తో మరోమారు టాలీవుడ్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు.
‘తీన్మార్’ తర్వాత మంచు మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’, నందమూరి కల్యాణ్ రామ్ ‘ఓమ్ 3డీ’, రామ్ ‘ఒంగోలు గిత్త’, రామ్ చరణ్ ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ సినిమాలతో తెలుగువారిని పలకరించారు కృతి కర్బందా. కానీ పైసినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. దీంతో తన మకాంను ముంబైకి మార్చారామె. ఈ క్రమంలో ‘రాజ్: రీబూట్’, ‘యమ్లా పగ్లా దివానా: ఫిర్ సే’, ‘హౌజ్‌ఫుల్ 4’, ‘పాగల్‌పంతీ’ చిత్రాలతో అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఓటీటీలో రిలీజైన ‘తైష్’లో నటనకు గానూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు కృతి. అలాంటి ఆమె గతంలో ఒక భయంకరమైన ఘటనను ఎదుర్కొన్నారట.
తాను బస చేసిన హోటల్ రూమ్‌లో ఒకసారి సీక్రెట్ కెమెరాను గుర్తించానని రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి కర్బందా చెప్పారు. ఇది తనను చాలా భయపెట్టిందని అన్నారామె. తాను యాక్ట్ చేసిన ఓ కన్నడ సినిమా షూటింగ్ టైమ్‌లో జరిగిన ఆ ఘటనను తాను మర్చిపోలేనన్నారు. ‘నేను ఉండే రూమ్‌ను తరచూ చెక్ చేయడం నాకూ, నా టీమ్‌కూ అలవాటు. అలా, నా గదిలో ఓ కెమెరాను గుర్తించాం. రూమ్‌లోని సెట్ అప్ బాక్స్ బ్యాక్ సైడ్ అతడు ఉంచిన కెమెరాను చూసి నేను షాకయ్యా. అప్పటి నుంచి బయట ఎక్కడైనా ఉండాల్సి వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా’ అని కృతి కర్బందా చెప్పుకొచ్చారు.