iDreamPost
android-app
ios-app

షాక్ ఇస్తున్న ఎఫ్3 బుకింగ్స్ – ఎందుకిలా?

  • Published May 26, 2022 | 5:00 PM Updated Updated May 26, 2022 | 5:00 PM
షాక్ ఇస్తున్న ఎఫ్3 బుకింగ్స్ – ఎందుకిలా?

రేపు విడుదల కాబోతున్న ఎఫ్3 మీద మాములు అంచనాలు లేవు. చాలా గ్యాప్ తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్ల దాకా తీసుకొస్తుందనే నమ్మకం ట్రేడ్ లో బలంగా ఉంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ లో చూస్తే ఏ థియేటర్లోనూ కంప్లీట్ హౌస్ ఫుల్ షోలు లేవు. ఆట మొదలయ్యే సమయానికి అవుతుందనుకున్నా మాములుగా ఒక రోజు ముందు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయనే దాన్ని బట్టి అది ఎంత ట్రెండింగ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎఫ్3కి భిన్నమైన పరిస్థితి కనిపించడం అంతుచిక్కడం లేదు.

దీనికి కారణాలు లేకపోలేదు. నిర్మాత దిల్ రాజు ఎంత పాత రేట్లే అని చెప్పుకున్నా ఆ మధ్య తెలంగాణ కొత్త జిఓలో వచ్చిన గరిష్ట ధరనే మల్టీ ప్లెక్సులో పెట్టారు. అది 295 రూపాయలు. సగటు మధ్యతరగతికి కుటుంబంతో సహా చూడాలంటే ఇది పెద్ద మొత్తం. సింగల్ స్క్రీన్ లోనూ 175 ఉంది. కానీ ఇవి పరిమిత సంఖ్య కాబట్టి అందరికీ అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు ముందస్తుగా బుకింగ్స్ లో అద్భుతాలు ఆశించడం అత్యాశే అవుతుంది. పైగా వెంకటేష్ ఒక్కడే ఎఫ్3లో మేజర్ సెల్లింగ్ ఫ్యాక్టర్ గా మారారు. నారప్ప, దృశ్యం 2లు డైరెక్ట్ ఓటిటిలో రావడం ఇప్పుడీ పరిణామానికి కారణం కావొచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఏపిలో సాధారణ ధరలే ఉన్నాయి కాబట్టి అక్కడ సిచువేషన్ కొంత నయంగానే కనిపిస్తోంది. బుకింగ్స్ కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయి.

ఏది ఏమైనా ఎఫ్3కి పబ్లిక్ టాక్ చాలా కీలకం. ఫుల్ గా నవ్వుకున్నాం అనే మాట బయటికి వస్తే కానీ జనం థియేటర్ల దాకా వెళ్లేలా లేరు. అలా జరగాలంటే ఎఫ్2ని మించిన ఎక్స్ ట్రాడినరీ కంటెంట్ ఇప్పుడీ సీక్వెల్ లో ఉండాలి. దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకీ వరుణ్ లు ఆ మేరకు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంకో వారం రోజులో మేజర్, పృథ్విరాజ్, విక్రమ్ లాంటి భారీ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో ఎఫ్3 మొదటి వారం రోజులు బలంగా నిలబడాల్సి ఉంటుంది. సోనాలి చౌహన్, సునీల్ లాంటి అదనపు క్యాస్టింగ్ తో పాటు ఫస్ట్ పార్ట్ లో ఉన్నవాళ్ళంతా ఇప్పుడీ ఎఫ్3లోనూ ఉన్నారు. చూడాలి రేపీ ఎంటర్ టైనర్ ఎలాంటి మేజిక్ చేయనుందో.