iDreamPost
android-app
ios-app

దేశమంతా హనుమాన్ ఫీవర్…..

Nitesh Tiwari Make Ramayan:

Nitesh Tiwari Make Ramayan:

దేశమంతా హనుమాన్ ఫీవర్…..

అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, సినిమాలైనా, కథలైనా, హనుమంతుడి పాత్రకున్నంత క్రేజ్ అండ్ ఫాలోయింగ్ పురాణాలలో మరే పాత్రకు లేదంటే పెద్ద విచిత్రం కాదు. మొదటి నుంచి కూడా అటు హిందీ కావచ్చు, ముఖ్యంగా తెలుగు కావచ్చు గానీ, హనుమంతుడి పాత్ర సినిమాల విజయానికి చాలా పెద్ద ఎసెట్ గానే నిలిచింది. మనకి తెలుగులోనైతే 1968లో పౌరాణికి బ్రహ్మ అనిపించుకున్న కమలాకర కామెశ్వరరావు దర్శకత్వంలో కాంతారావు రాముడిగా, అంజలీదేవీ సీతగా, ఎస్వీరంగారావు రావణుడిగా వచ్చిన వీరాంజనేయ బంపర్ హిట్ అయింది. తర్వాత ఎన్నో సినిమాలు లైక్ సంపూర్ణ రామాయణం, రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్దం లాటి పౌరాణికి సినిమాలే కాదు, ముత్యాలముగ్గు లాటి సాంఘిక సినిమాలు కూడా అంజేయుడి పాత్ర రక్తికట్టి, సూపర్ హిట్లయ్యాయి.

సరే పాత చరిత్ర ఎందుకు ఏకరువు పెట్టడం….మొన్నీ మధ్యన సంక్రాంతికి రిలీజైన ప్రశాంత్ వర్మ డైరెక్టోరియల్ వెంచర్ హనుమాన్ దుమ్ము దులిపేస్తోంది. సినిమాలో నేరుగా హనుమంతుడి పాత్ర లేకపోయినా, ఊహామాత్రంగా గ్రాఫిక్స్ లో ప్రెజెంట్ చేసినా కూడా, కేవలం ఆ ఎఫెక్ట్ ఏకంగా నిన్న మొన్నటికి 250కోట్లు పైచిలుకు కలెక్ట్ చేసి ప్రభంజనమైంది. హనుమాన్ తో పాటు రిలీజైన పెద్ద హీరోల సినిమాలు కూడా దాని ముందు నీరుగారిపోయాయి. అదీ హనుమంతుడి స్టామినా.

హిందీలో పౌరాణిక సినిమాలు పెద్దగా రాణించిన దాఖలాలు కనబడవు. వాళ్ళ ముఖాలు, గెటప్స్ ఎందుకో పౌరాణిక పాత్రలకు సెట్ కాలేదు. ఫౌరాణికాలంటే, ఎన్టీ ఆర్ పుణ్యమా అని, తెలుగువాళ్ళకే సొంతమన్నట్టు అయిపోయింది. రామానంద సాగర్ టీవి రామాయణం సంకల్పించినప్పుడు కూడా ముందుగా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ తో సంప్రదిపులు జరిపి మరీ షూటింగ్ మొదలెట్టారు. ఇప్పుడంతా గ్రాఫిక్స్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా ఫరవాలేదు. హనుమంతుడి మహిమలు, లీలలు గ్రాఫిక్స్ లో ప్రెజెంట్ చేస్తే చూడ్డానికి సూపర్ గా ఉంటుంది. అందుకే ఇప్పుడు హిందీవాళ్ళు కూడా హనుమంతుడి పాత్రనే ఆశ్రయిస్తున్నారు. దర్శకుడు నితిష్ తివారి మూడు భాగాలుగా రామాయణ అనే చిత్రహోమం మొదలు పెట్టాడు. అందులో రణ్బీర్ కపూర్ రాముడిగా ఎంపికయ్యాడు. సీతగా సాయి పల్లవి రామాయణంలోకి ప్రవేశించబోతోంది.

హనుమంతుడి పాత్రను చేయమని సన్నీడియోల్ ని దర్శకనిర్మాతలు కోరుతున్నారు. సన్నీ కూడా ఎక్సైట్ అయ్యాడు. చేస్తానని ఓకే చేశాడు. అందుకు సన్నీ మరో సినిమా కూడా హనుమాన్ పూర్తయ్యేవరకూ ఒప్పుకోకూడదని నియమం తనకి తానే విధించుకున్నాడు. రణ్బీర్ కపూర్ ఏకంగా మీట్ తినడం మానేసి, తాగుడు, పార్టీలకి దూరంగా హనుమాన్ కంప్లీట్ అయ్యేవరకూ కూడా ఉండాలని సెల్ఫ్ కండిషన్ అప్లై చేసుకుంటున్నాడు. సీతకి ముందుగా ఆలియా భట్ ని అనుకున్నా, సీత పాత్రకు సరైన పవిత్రత ప్రతిబింబించాలంటే సాయి పల్లవే కరెక్ట్ అని మళ్ళీ నిర్ణయం మార్చుకుని సాయి పల్లవినే తీసుకున్నారు.

రామాయణ మూడు భాగాలూ పూర్తయ్యేవరకూ మరో సినిమా సైన్ చేయకుండా ఉండడానికి సన్నీ నిర్మాతలని 45 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే నిర్మాతలు ఒప్పుకోక తప్పలేదు. దానికి రెండు కారణాలు. ఒకటి గదార్ 2 మేసివ్ హిట్ కావడం, రెండు హనుమంతుడి పాత్రకు సన్నీ తప్పితే మరొక ఆప్షన్ అన్నదే లేదనే నిర్ణయానికి వచ్చిన దర్శక నిర్మాతలు సన్నీకే ఫిక్స్ అయిపోయారు. హనుమంతుడి పాత్రకు కావాల్సిన స్ట్రాంగ్ పర్సనాలిటీ, యాక్టింగ్ కెపాసిటీ ఒక్క సన్నీ డియోల్ కి మాత్రమే ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు. హనుమాన్ సినిమా కేవలం రాముడి పాత్ర ఒక్కటితోనే ముడిపడి ఉండదు, రామాయణం అనే సుదీర్ఘమైన కావ్యం కన్నా కూడా హనుమాన్ పాత్ర చాలా విశాలమైనది, పెద్దది అనే కాన్సెప్ట్ తో రామాయణ సినిమా మూడు భాగాలు తయారు కాబోతోంది.

నిజమే హనుమంతుడి పాత్ర రామాయణం తర్వాత కూడా కొనసాగింది. ఇప్పటికీ హనుమాన్ సజీవంగానే ఉన్నాడు, హిమాలయాలలో సంచరిస్తున్నాడు అనే భక్తిభావంతోనే హిందువులంతా ఆయన్ని కొలుస్తారు. రామాయణం తర్వాత మొదలైన మహాభారతంలో కూడా హనుమంతుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతయుద్ధంలో కృష్ణుడు రథం తోలుతుంటే, ఆర్జునుడి రథం మీద హనుమంతులవారు ఉన్నారనే వ్యాసుడు రాశారు. సప్త చిరంజీవులలో అగ్రగణ్యుడిగా కొనియాడబడే హనుమంతులవారు కలియుగంలో కూడా సజీవంగా ఉన్నారు, నమ్మి కొలిచే భక్తులకు అండగా ఉండి, కాచికాపాడతారనే అచంచలమైన విశ్వాసం ప్రపంచమంతా ఉంది. ఈ మథ్య హాలీవుడ్ పరిశ్రమ కూడా మన హిందూ పురాణాలని, అందులోని పాత్రలని బాగా కాపీ కొట్టేసి, హిట్లు కొట్టెస్తున్నారు. జేమ్స్ కేమరూన్, స్పిల్ బర్గ్ లాటి అతిరథమహారథులే ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు.

నిజంగానే నమ్మి కొలిచేవారి కొంగుబంగారమే హనుమాన్లువారు అన్నది మొన్నకూడా నిరూపణ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కొత్తగా అమెరికా నుంచి వచ్చిన ఐటి ఎక్స్ పర్ట్ నిరంజన రెడ్డి హనుమాన్ సినిమా తీసి, రిలీజ్ విషయంలో నానా అగచాట్లు పడ్డారు. అయినా, మాకు హనుమంతుడే రక్ష అని ఇంటర్వూల్లో చెప్పారు. హనుమంతుడిని నమ్మారు. నిజంగానే హనుమంతుడి పట్ల వాళ్ళ అపారమైన భక్తివిశ్వాసాలు తిరుగులేని రీతిలో ప్రూ అయింది. కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టే స్క్రీన్లే లభించినా అనుకున్న డేట్ కి రిలీజ్ చేశారు నిరంజన్ రెడ్డి. ఆయనకు ఇక్కడ ఏ అండా దండా లేవు. సినీ పరిశ్రమకు పూర్తిగా కొత్త. కోటరీలు లేవు. తొక్కెద్దామని కొందరు అనుకున్నా కూడా నిటారుగా నిలబడి, మొండిగా దొరికిన ఆ కొద్ది స్క్రీన్లలోనే రిలీజ్ చేసుకున్నారు.

ప్రీమియర్లతోనే దడ పుట్టించేసింది సినిమా. ఇంక అక్కడ నుంచి చితక్కొట్టేసింది సినిమా. ఇప్పటికీ ఆ కొట్టుడు ఆగలేదు. రోజురోజుకి పెరిగిపోతోంది. మన సూపర్ హీరో హనుమాన్ ని ప్రపంచానికి పరిచయం చేస్తామని గొప్ప కమిట్ మెంట్ తో, కేవలం హనుమంతుడే కాపాడతాడనే దైర్యంతో ప్రపంచభాషలలో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. చేయబోతున్నారు. ఇదో మహత్తరమైన ఘట్టంలా, హనుమంతులవారి మహిమలలో ఇది కూడా ఒక ప్రధానమైన లీలగానే ఒప్పుకునేట్టు ఆకాశాన్ని అంటుతోంది నిరంజన్ రెడ్డి సాహసానికి ఫలితం.

ఇప్పుడింక రణ్బీర్, సన్నీడియోల్, సాయిపల్లవి కాంబినేషన్లో రాబోతున్న త్రి పార్ట్ ఫ్రాంచైజ్ రామాయణ్ ఎటువంటి సంచలనాలు రేపుతుందో వేచి చూడాలి. ఫిబ్రవరి నెలలో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకోబోతున్న రామాయణ్ నిర్మాతలలో మన ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఉండడం విశేషం.